గుంటూరు నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ తప్పనిసరిగా చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం ఆర్టీసి కాలనీ, రెడ్ల బజార్, బాలాజీ నగర్, యాదవ బజార్ ప్రాంతాల్లో పిజిఆర్ఎస్, డివైసిల్లో అందిన ఫిర్యాదులను, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రతి రోజు చెత్త సేకరణ జరగకపోతే సంబంధిత కార్మికులు, కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లే భాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రెడ్ల బజార్ నుండి డివైసికి అందిన ఫిర్యాదును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, స్థానికులతో మాట్లాడి పారిశుధ్య విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారని గుర్తించిన కార్మికులు, శానిటేషన్ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మెయిన్ రోడ్ల స్వీపింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.
కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి స్వీపింగ్ మెరుగ్గా జరిగేలా, స్వీపింగ్ సమయంలోనే డివైడర్లకు ఉన్న పోస్టర్స్ ని తొలగించాలని ఆదేశించారు. ప్రజలు కూడా సహకరించి తమ ఇంటిలో వచ్చే చెత్తను తడిపొడిగా వేరు చేసి, ప్రజారోగ్య కార్మికులకే అందించాలని, సమస్యలు ఉన్నచో పిజిఆర్ఎస్, డివైసిల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. నగరంలో అనధికార బ్యానర్లు, హోర్డింగ్స్ కి అనుమతి లేదని, ఏర్పాటు చేసిన వారు, ప్రింట్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులను ఆదేశించారు. నందివెలుగు రోడ్ నుండి సుద్దపల్లి డొంక వైపు ఉన్న రోడ్ ని విస్తరణ చేయడానికి
ఆర్డీపీని సిద్దం చేయాలని ఏసిపీని ఆదేశించారు.
పర్యటనలో ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నారాయణ, డిఈఈ హనీఫ్, ఎస్ఎస్ సాంబయ్య, అయూబ్ ఖాన్, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.




