గుంటూరు జిల్లా పోలీస్..
డ్రగ్స్ వినియోగం – మానవ మనుగడకే ప్రమాదం” — గుంటూరు వెస్ట్ డీఎస్పీ శ్రీ కె. అరవింద్ గారు,.//*
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల మానవ ప్రాణాలకే కాకుండా, భవిష్యత్తు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని గుంటూరు వెస్ట్ డీఎస్పీ శ్రీ కె. అరవింద్ గారు హెచ్చరించారు.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, “సంకల్పం” కార్యక్రమంలో భాగంగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని TJPS కళాశాల నందు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గారు విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.
డ్రగ్స్ వినియోగం ఒక్కసారిగా ఆసక్తితో మొదలైనప్పటికీ, అది జీవితాంతం వెంటాడే వ్యసనంగా మారుతుందని తెలిపారు. “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి తన కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడే విధంగా జీవితం మలుచుకోవాలని సూచించారు.
స్నేహితుల ఒత్తిడితో గానీ, సరదా కోసం గానీ మత్తు పదార్థాలకు అలవాటు పడితే, అది శారీరకంగా, మానసికంగానే కాకుండా మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ సేవించే వారు ఏదో ఒక రోజు తప్పకుండా పోలీసులకు చిక్కుతారని, NDPS చట్టం కింద కేసులు నమోదైతే కనీసం 10 సంవత్సరాల నుండి గరిష్టంగా 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది యువత జీవితంలో అత్యంత కీలక సమయాన్ని కోల్పోయే ప్రమాదాన్ని తెస్తుందని పేర్కొన్నారు.
గంజాయి లేదా డ్రగ్స్ సేవిస్తున్నా, విక్రయిస్తున్నా ఎవరి గురించి అయినా సమాచారం ఉంటే, టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని డీఎస్పీ అరవింద్ గారు ప్రజలను కోరారు. పోలీస్ డాక్టర్‌గా పేరుగాంచిన ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీ మండవ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత, విద్యార్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని తెలిపారు.
ఇవి శారీరకంగా, మానసికంగా తీవ్ర నష్టం కలిగిస్తాయని చెప్పారు. ఆరు నెలల పాటు గంజాయి సేవిస్తే నరాల బలహీనత ఏర్పడుతుందని, ఏడాది పాటు వినియోగిస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని, ఏడాదిన్నర పాటు నిరంతరంగా గంజాయి సేవిస్తే ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.
డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు పోలీసులు, ఈగల్ బృందాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయని తెలిపారు. పట్టాభిపురం సీఐ శ్రీ గంగా వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైన దశ అని, ఈ సమయంలో మంచి–చెడులను గుర్తించి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించి, ఉన్నత స్థానాలను సాధించి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని విద్యార్థులను కోరారు.
కళాశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, పెద్దల సూచనలు పాటించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని దాచుకోకుండా ఉపాధ్యాయులతో పంచుకుని పరిష్కారం పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ డీఎస్పీ శ్రీ కె. అరవింద్ గారితో పాటు పట్టాభిపురం సీఐ శ్రీ గంగా వెంకటేశ్వర్లు గారు, ఎస్సైలు శ్రీ రామాంజనేయులు గారు, శ్రీమతి తరంగిణి గారు, TJPS కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కామేశ్వర శాస్త్రి గారు, కళాశాల యాజమాన్యం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




