అంజుమన్-ఎ-ఇస్లామియా, గుంటూరు సంస్థకు చెందిన నోటిఫై చేసిన వక్ఫ్ భూములను ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూ సేకరణ చేయాలనే ప్రయత్నాలను నిలిపివేయాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన వివిధ ముస్లిం సంఘాల నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామ పరిధిలో ఉన్న సుమారు 71.57 ఎకరాల భూములు 1962 వక్ఫ్ గెజిట్‌లో నోటిఫై అయిన వక్ఫ్ భూములని, ఇవి అంజుమన్-ఎ-ఇస్లామియా సంస్థ ఆధ్వర్యంలో మత, విద్యా మరియు దాతృత్వ కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయని వివరించారు. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయంతో పేద మరియు అర్హులైన విద్యార్థులకు విద్య అందిస్తున్నామని తెలిపారు.
వక్ఫ్ బోర్డు ఇప్పటికే ఈ భూములు ల్యాండ్ అక్విజిషన్‌కు ఇవ్వడానికి కుదరదని స్పష్టంగా చెప్పినప్పటికీ, సంబంధిత ప్రభుత్వ శాఖలు బలవంతంగా భూ సేకరణ ప్రక్రియ కొనసాగించడం వక్ఫ్ చట్టానికి పూర్తిగా విరుద్ధమని వారు ఆరోపించారు. వక్ఫ్ బోర్డు తీసుకున్న తీర్మానాలు మరియు సీఈఓ అధికారిక లేఖలు ఉన్నా కూడా వాటిని పక్కనపెట్టి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుండటం అన్యాయమని అన్నారు.
ఈ పరిస్థితుల్లో వక్ఫ్ భూములను రక్షించేందుకు వక్ఫ్ బోర్డు తరఫున గౌరవ హైకోర్టు లేదా గౌరవ వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి న్యాయపోరాటం చేయాలని వారు చైర్మన్‌ను కోరారు. వక్ఫ్ భూములు అల్లాహ్ ఆస్తులని, వాటిని కాపాడటం వక్ఫ్ బోర్డు యొక్క చట్టబద్ధ బాధ్యత మాత్రమే కాకుండా మతపరమైన అమానత్ కూడా అని నాయకులు స్పష్టం చేశారు.
ఈ భూ సేకరణ జరిగితే వక్ఫ్ సంస్థ నిర్వీర్యమై, ముస్లిం సమాజానికి అపరిహార నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు. అందుకే ఈ అంశంపై తక్షణమే స్పష్టమైన చర్యలు తీసుకుని భూ సేకరణను పూర్తిగా నిలిపివేయాలని వక్ఫ్ బోర్డును వారు డిమాండ్ చేశారు.
