Friday, January 2, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshశరవేగంగా శంకర్ విలాస్ ఆర్‌ఓబి పనులు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు

శరవేగంగా శంకర్ విలాస్ ఆర్‌ఓబి పనులు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు

గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబి) నిర్మాణ పనులను శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మేయర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, సంబంధిత శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. ఆర్‌ఓబి పనుల ప్రగతి, వేగం, నిర్మాణ నాణ్యతతో పాటు ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు, విమర్శలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ…
కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో శంకర్ విలాస్ బ్రిడ్జి పనులను క్షుణ్ణంగా పరిశీలించామని, ఈస్ట్ వైపు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పశ్చిమ నియోజకవర్గం వైపు కూడా పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు తెలిపారు. ఈ ఆర్‌ఓబి నిర్మాణానికి నిర్ణయించిన డెడ్‌లైన్ జూలై 2027 అయినప్పటికీ, ఆ తేదీకి ముందే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని, ఆర్‌ఓబి నిర్మాణ సమయంలో ఎదురవుతున్న ప్రధాన అంశం ట్రాఫిక్ సమస్య మాత్రమేనని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు తెలిపారు. అయితే ఈ ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కార్ మరియు ద్విచక్ర వాహనంలో తిరుగుతూ పరిశీలించామని చెప్పారు. భారీ నిర్మాణ పనులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులు ఒకేసారి జరుగుతున్నప్పటికీ ఎక్కడా 10 నిమిషాల కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ లేకుండా అధికారులు సమర్థంగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల్లో అయితే కిలోమీటర్ల కొద్దీ గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితులు ఉంటాయని, అలాంటివి గుంటూరులో లేకుండా ట్రాఫిక్ మళ్లింపు, రద్దీ సమయాల్లో ప్రత్యేక సిబ్బంది నియామకం, ఆక్రమణల తొలగింపు, ఫ్రీ లెఫ్ట్‌ల క్లియర్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

అంతేకాకుండా, కొన్ని ప్రాంతాల్లో భవనాల సెల్లార్లను పార్కింగ్‌కు ఉపయోగించకుండా వ్యాపారాలకు వినియోగించడంతో రోడ్లపై అక్రమ పార్కింగ్ పెరుగుతోందని, దీనిపై అధికారులు మరింత దృష్టి సారించాలని సూచించారు.

ఈ సందర్భంగా వైసీపీ నేతల విమర్శలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు, బురదజల్లే ప్రయత్నాలు చేసినా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయించిన డెడ్‌లైన్‌లో ఆర్‌ఓబి పూర్తి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలపై అవాస్తవ ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్ష నేతలు ముందు తమ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

అభివృద్ధి అనేది మాటలతో కాదు, పనులతో చూపించాల్సిన అంశమని, కూటమి ప్రభుత్వం అదే చేస్తోందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు తెలిపారు. ప్రజల ఇబ్బందులను తగ్గిస్తూ, నిర్మాణాత్మకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి గుంటూరు నగర ప్రజలకు శాశ్వత పరిష్కారం అందిస్తామని ఆమె స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments