జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి, అమరజీవి కామ్రేడ్ ఏబీ బర్ధన్ 10వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో, కొత్తపేటలోని సీపీఐ గుంటూరు కార్యాలయంలో వర్ధంతి సభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సీపీఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి కామ్రేడ్ ఏబీ వర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, కామ్రేడ్ ఏబీ వర్ధన్ విద్యార్థి నాయకుడిగా ఏఐఎస్ఎఫ్ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అఖిల భారత నాయకుడిగా ఎదిగారని గుర్తు చేశారు. కార్మిక హక్కుల రక్షణ, నూతన సమాజ నిర్మాణం కోసం ఆయన చేసిన పోరాటాలు నేటికీ ఆదర్శప్రాయమన్నారు. నాలుగు దఫాలు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ దేశంలోని లెఫ్ట్ పార్టీలను ఐక్యంగా నిలబెట్టేందుకు విశేష కృషి చేశారని, మతోన్మాదం, కులవాదం, విభజన వాదాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసిన మహనీయుడని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణ, భారత సార్వభౌమత్వ రక్షణ కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో జన్మించిన కామ్రేడ్ ఏబీ బర్ధన్ విద్యార్థి ఉద్యమాల నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, నాగపూర్ యూనివర్సిటీ అధ్యక్షుడిగా, అనంతరం ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నాగపూర్ శాసనసభకు ఎన్నికై, శాసనసభలో విద్యార్థులు, యువజనులు, మహిళలు, కార్మికుల సమస్యలపై గళమెత్తారని అన్నారు. 1996 నుంచి 2012 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన లేని లోటు పార్టీకి, ప్రజలకు తీరని లోటు అని పేర్కొన్నారు.
కార్మిక నేతగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు. నేటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడమే ఆయనకు మనం అర్పించే నిజమైన ఘన నివాళి అని అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల విద్య, వైద్య రంగాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయని విమర్శించారు. విద్యార్థి, యువజన ఉద్యమాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలకు ఎదురొడ్డి, కామ్రేడ్ ఏబీ బర్ధన్ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. విద్య, వైద్య రంగాల పరిరక్షణ కోసం, సామాన్య ప్రజల హక్కుల కోసం బర్ధన్ గారి ఆశయాలను కొనసాగిస్తూ పోరాటాలు సాగిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, సిపిఐ గుంటూరు నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు, నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, సురేష్ బాబు, విరిగినేని వెంకటేశ్వర్లు, జంగాల చైతన్య, గుండెబోయిన లక్ష్మి, మంగా శ్రీనివాసరావు,చల్లా మరియదాసు, నగర సమితి సభ్యులు చెవుల పున్నయ్య, ఆకీటి రామచంద్రుడు, జగన్నాథం,శ్రీనాథ్, కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు హస్సన్, వేగయ్య ఏఐఎస్ఎఫ్ నాయకులు గని, సన్నీ, రాగం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.




