కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, నియోజకవర్గంలోని లబ్ధిదారులకు పదోన్నతి పత్రాలను ఆయన పంపిణీ చేశారు.
శుక్రవారం సాయంత్రం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గిద్దలూరు మరియు బెస్తవారిపేట మండలాలకు చెందిన 39 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పదోన్నతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీల పట్ల అత్యంత సానుకూలంగా ఉందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీలు కోరిన 15 ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే 13 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన స్పష్టం చేశారు. అంగన్‌వాడీలు పదవీ విరమణ చేసిన అనంతరం ఇచ్చే ఆర్థిక సాయాన్ని 1,20,000 రూపాయలకు పెంచడం, మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చే మొత్తాన్ని 15,000 రూపాయలు, పదవీ విరమణ కాలాన్ని 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు.
తమ చిరకాల వాంఛ అయిన పదోన్నతిని కల్పించినందుకు, అలాగే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి అంగన్‌వాడీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు.




