కర్నూలు… ఆధ్యాత్మిక ప్రవచనాలతోనే యువతకు మార్గదర్శనం- మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ నేటి పోటీ ప్రపంచంలో తప్పుదారి పడుతున్నటువంటి యువతను సన్మార్గంలోకి తీసుకురావడానికి ఆధ్యాత్మిక ప్రవచనాలు మార్గదర్శకంగా నిలుస్తాయని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు ప్రముఖ ప్రవచనకర్త శ్రీ శ్రీ శ్రీ మద్దిపర్తి పద్మాకర్ గారి 403 వ శ్రీ మద్ భాగవత సప్తాహం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పిల్లలకు, యువతకు చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక అలవాట్లు నేర్పించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారమవుతమన్నారు. ఎక్కువ చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు 60 ఏళ్లు పైబడిన వారు వస్తుంటారని అటువంటి వారి కన్నా యువత ఎక్కువగా ఇటువంటి ప్రవచనాలు వినడానికి వస్తే వారి జ్ఞానం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పద్మాకర్ స్వామి వారు కర్నూలుకు రావడం కర్నూలు నేల అదృష్టమని.
ఆయన శిష్యులు ఎంతోమంది శిధిలావస్థకు చేరుకున్న ఆలయాలను జీర్ణోదరణ చేశారన్నారు. అటువంటి కార్యక్రమం ఎవరు చేసినా తన వంతు సహకారం అందిస్తానని టీజీ తెలిపారు. పాడుబడిన ఆలయాలకు జీర్ణోదరణకు మనం 25 శాతం నిధులు పెడితే 75% నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. మన ప్రాంతంలో ఎక్కడ జీర్ణోదరణకు అవసరమైన దేవాలయాలను గుర్తిస్తే మంత్రి భరత్ ద్వారా నిధులు విడుదల చేయిస్తానని టీజీ వెంకటేష్ తెలిపారు. అంతేకాకుండా శిధిలాలయాలకు సమకూర్చవలసిన 25 శాతం నిధులు కూడా తాము సొంతంగా భరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
స్థానికంగా ఉండే ప్రజలు అటువంటి దేవాలయాలను గుర్తించి సరైన ప్రణాళిక తీసుకుని ముందుకు రావాలని ఆయన కోరారు. స్వామీజీ ప్రవచనాల కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి పబ్లిసిటీ లేకపోయినా ఇంత మంది జనం రావడం ప్రజల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం అన్నారు. వారం రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగం టీజీ వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, డాక్టర్ వేణుగోపాల్, హరికృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




