గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ…
సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావు పూలే గారి సహచరిణిగా మాత్రమే కాకుండా, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా చిరస్మరణీయులని, ప్రతి ఆడపిల్ల తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు. ఆనాటి సమాజంలో కులవివక్ష, మతవివక్ష, మూఢాచారాలు, బాల్యవివాహాలు, సతీ వంటి అనేక అవరోధాలు ఉన్న సమయంలో “ఆడపిల్ల చదవాలి, చదువు విముక్తికి మార్గం” అనే ఆశయంతో సావిత్రిబాయి పూలే గారు ముందడుగు వేశారని గుర్తు చేశారు.
చిన్నప్పుడే చదువు అవకాశం లేకపోయినా, వివాహానంతరం జ్యోతిరావు పూలే గారి ప్రోత్సాహంతో చదువుకుని ఉపాధ్యాయురాలిగా మారి, వేలాది ఆడపిల్లల జీవితాల్లో వెలుగు నింపారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు తెలిపారు.
పాఠశాల తలుపులు తెరవడానికి వెళ్తూ అవమానాలు, బురదజల్లులు, రాళ్ల దాడులు ఎదుర్కొన్నప్పటికీ వెనకడుగు వేయకుండా, మరో చీర బ్యాగులో పెట్టుకుని మరీ ధైర్యంగా తన కర్తవ్యాన్ని కొనసాగించిన అపార సంకల్పశక్తి సావిత్రిబాయి పూలే గారి గొప్పతనమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు.
ఆడపిల్ల వెనకబాటుకు గురికాకూడదనే దృఢనిశ్చయంతో ఆమె సాగించిన పోరాటమే నేటి మహిళా విద్యకు పునాది అని అన్నారు.
ఈరోజు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నా, ఇంకా కొన్ని చోట్ల వివక్ష కొనసాగుతోందని, దాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు తెలిపారు. నేటి కాలంలో మహిళలు అంతరిక్షం వరకు వెళ్లగలుగుతున్నారంటే.
సావిత్రిబాయి పూలే గారు వంటి మహోన్నతుల కృషి ఫలితమేనని అన్నారు. గొప్ప కవయిత్రి, గొప్ప భావజాలం కలిగిన సావిత్రిబాయి పూలే గారికి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించే అవకాశం లభించడం తమ అదృష్టమని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు.




