కర్నూలు : కర్నూలు సిటీ కర్నూలు జిల్లా…సంక్రాంతికి ఊరెళ్తున్నారా? .విలువైన వస్తువులు లాకర్లలో భద్రపరుచుకోండి. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సెలవులలో సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు బుధవారం జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు వెళ్లే ముందు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారని, ఇదే అదనుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశముందన్నారు.
దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పండుగకు ఊరెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దన్నారు. ఇంట్లో ఎవరూ లేరని తెలియకుండా ఉండేందుకు రాత్రివేళ లైట్లు వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలి.అపార్ట్మెంట్ల కాలనీ వాసులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. భద్రత మరింత మెరుగుపడుతుందిప్రయాణాల్లో జాగ్రత్త.
బస్సుల్లో ప్రయాణించేటప్పుడు విలువైన వస్తువులు, ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ఆహారం, పానీయాలను తిరస్కరించాలి.ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదన్నారు. బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవడం ఉత్తమమన్నారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీలను నివారించవచ్చని, తద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చన్నారు.
నేరాల నివారణకు, అసాంఘిక శక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించడం ద్వారా సహకరించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు , జిల్లా ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఎక్కడైనా అనుమానితులు కన్పిస్తే , అత్యవసర సమయంలో వెంటనే డయల్ 112 కు గాని , డయల్ 100 కు ఫోన్ చేసి స్ధానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.ఈ సూచనలు దొంగతనాల వంటి నేరాలను అరికట్టి, పండుగను ప్రశాంతంగా జరుపుకోవడానికి సహాయపడతాయని డిఐజి కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు.




