ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం
బాపట్ల జిల్లా చీరాల: బాపట్ల జిల్లా చీరాల లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో ఉన్న అద్దె బస్సుల యజమానులు జనవరి 12 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇవాళ సంబంధిత ఆర్టీసీ అధికారులకు నోటీసులు అందజేయనున్నట్లు అద్దె బస్సుల యాజమాన్యం వెల్లడించింది.
శ్రీశక్తి పథకం అమలుతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగి తమపై అధిక భారం పడుతోందని యజమానులు చెబుతున్నారు. పెరిగిన రద్దీ కారణంగా ఇంధన వినియోగం అధికమై, నిర్వహణ మరియు మరమ్మత్తుల ఖర్చులు భారీగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో అదనంగా ఒక్కో అద్దె బస్సుకు రూ.5,200
చెల్లించాలని జనవరి 7న ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితులకు ఇది సరిపోదని, కనీసం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు చెల్లించాలని అద్దె బస్సుల యాజమాన్యం డిమాండ్ చేస్తోంది. పలుమార్లు విన్నపించినప్పటికీ అధికారులు కేవలం రూ.5,200 మాత్రమే పెంచుతామని చెప్పడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యామని తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,500కు పైగా అద్దె బస్సులు ఏపీఎస్ ఆర్టీసీ సేవల్లో
నడుస్తున్నాయి. ఇవి సమ్మె కారణంగా నిలిచిపోతే, సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని యాజమాన్యం హెచ్చరిస్తోంది.సగటున బస్సుకు ఇంధన వినియోగం మూడు లీటర్ల నుంచి నాలుగు లీటర్ల వరకు పెరిగిందని, దానికి అనుగుణంగా మరమ్మత్తులు చేయాల్సి వస్తోందని వారు తెలిపారు. అన్ని ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో తాము కోరిన విధంగా చెల్లింపులు చేస్తేనే బస్సులను సజావుగా నడపగలమని స్పష్టం
చేశారు.తమ సమస్యపై అధికారులు స్పందించి న్యాయం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని, అవసరమైతే ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తామని అద్దె బస్సుల యాజమాన్యం ప్రకటించిది
#Narendra




