Home South Zone Andhra Pradesh రహదారులపై జంతువులను వదిలితే కఠిన చర్యలు: కమిషనర్

రహదారులపై జంతువులను వదిలితే కఠిన చర్యలు: కమిషనర్

0

కర్నూలు : కర్నూలు సిటీ :
రహదారులపై జంతువులు వదిలితే కఠిన చర్యలు• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• 30 మంది జంతు యజమానులకు జరిమానా• డాగ్ షెల్టర్ నిర్మాణ పనులు ప్రారంభం నగరంలో రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో జంతువులను వదిలి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు.

శుక్రవారం ముజఫర్‌నగర్ ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న పశువులను గుర్తించి, సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశానికి తరలించారు. జంతువులను బహిరంగంగా వదిలిన యజమానులపై ఒక్కో జంతువుకు రూ.500 చొప్పున జరిమానా విధించి, ఇకపై జంతువులను రహదారులపై వదలబోమని లిఖితపూర్వక హామీ తీసుకోవాలని శానిటేషన్ ఇన్‌స్పెక్టర్‌కు కమిషనర్ ఆదేశించారు.

అదేవిధంగా నగరంలోని విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రార్థనా మందిరాలు వంటి జనసమ్మర్ద ప్రాంతాల్లో ప్రజలకు ప్రమాదంగా మారుతున్న వీధి కుక్కలను నియంత్రించేందుకు గార్గేయపురం డంప్‌యార్డులో పనులు ప్రారంభించిన డాగ్ షెల్టర్‌ను కమిషనర్ పరిశీలించారు. అక్కడే కొనసాగుతున్న బయో మైనింగ్ ప్రక్రియను పరిశీలించి, ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

బయో మైనింగ్ ద్వారా వేరు చేసిన వ్యర్థాలను సిమెంట్ కంపెనీలకు తక్షణమే తరలించాలని, 15 ఎకరాల విస్తీర్ణంలో బయో మైనింగ్ ద్వారా ఖాళీ అయ్యే స్థలాన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు వినియోగించాల్సి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారులపై జంతువులను వదలడం నిషేధించామని తెలిపారు.

అనేకసార్లు హెచ్చరించినప్పటికీ ముజఫర్‌నగర్ ప్రాంతంలో జంతువులను బహిరంగంగా వదిలిన 30 మంది యజమానులకు రూ.500 చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. జరిమానాతో పాటు ఇకపై జంతువులను వదిలితే గోశాలలకు తరలింపునకు అంగీకరిస్తూ యజమానుల నుంచి లిఖితపూర్వక హామీ పత్రాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.గార్గేయపురం డంప్‌యార్డులో డాగ్ షెల్టర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని.

వాటిని త్వరితగతిన పూర్తి చేసి జనసమ్మర్ద ప్రాంతాల్లో ఉన్న ప్రమాదకర వీధి కుక్కలను అక్కడికి తరలిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ చర్యలను వేగవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగప్రసాద్, డీఈఈలు గిరిరాజ్, పవన్‌కుమార్ రెడ్డి, ఏఈ జనార్ధన్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version