కిడ్నీ వ్యాధి రహిత తిరువూరు లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ – ఎంపీ కేశినేని శివనాథ్..
కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిడ్నీ బాధితులకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేసిన ఎంపీ..
కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మిషా, ఆర్డిఓ మాధురి..
తిరువూరు : జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిని శాశ్వతంగా నివారించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, జనవరి మాసాంతం నాటికి కృష్ణా జలాలను అందుబాటులోకి తీసుకురానున్నామని, వ్యాధిగ్రస్తులను గుర్తించి నెఫ్రాలజిస్టు సేవల ద్వారా మెరుగైన వైద్య సేవలందించడంతో పాటు పౌష్టికాహారపు కిట్లను పంపిణి చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. అలాగే కిడ్నీ వ్యాధి రహిత తిరువూరు లక్ష్యంగా సమగ్ర కార్యచరణ తో జిల్లా అధికారులతో కలిసి ముందుసాగుతున్నట్లు కలెక్టర్ లక్ష్మీశా తో కలిసి స్పష్టం చేశారు.
కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులు, డయాలసిస్ పేషంట్లకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఏ కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్.. జిల్లా కలెక్టర్ లక్ష్మిషా, తిరువూరు ఆర్డీవో మాధురిలతో కలిసి ప్రారంభించారు.
తిరువూరు నియోజకవర్గంలో దాదాపు 647 మంది కిడ్నీ బాధితులకు పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు. నెల రోజులకు సరిపోయే విధంగా 60 మరమరాల ఉండలు, 30 నువ్వులు ఉండలు, అటుకులు, జొన్నపిండి వంటి ఇతర పౌష్టికాహారంతో కిట్స్ పంపిణీ చేయటం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కృష్ణా జలాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని.. జనవరి మాసాంతానికి కృష్ణా జలాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి కొండపల్లి రైల్వేగేటు వద్ద ఏర్పడిన లీకేజ్ సమస్య, ఇతర ప్రాంతాల్లో మరమ్మత్తుల పనులకు రూ. 350 కోట్లు అదనపు నిధులతో పనులు శరవేగంతో జరుగుతున్నాయని.. పనులను పూర్తిచేసి జనవరి చివరినాటికి ప్రతిఇంటికీ కృష్ణా జలాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
తిరువూరు నియోజకవర్గ ప్రజల చిరకాల సమస్య అయిన గంపలగూడెం మండలం, కట్టలేరుపై వంతెన నిర్మాణం పనులను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని… ఇందుకు సంబంధించిన డీపీఆర్‌లు పూర్తయ్యాయన్నారు. సాగర జలాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గతంలో తమ ప్రభుత్వం చింతలపూడి పిట్టవానిపాలెం ఎత్తిపోతల పథకాలను శ్రీకారంచుట్టడం జరిగిందని.. గత ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. తిరిగి మళ్లీ పనులు పూర్తిచేసి సాగర జలాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పేద కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా కేశినేని ఫౌండేషన్ పనిచేస్తోందని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 647 మంది కిడ్నీ బాధితులకు ప్రతి నెల 7వ తేదీలోపు ఆరు నెలల పాటు పౌష్టికాహారం అందజేస్తామని స్పష్టం చేశారు. మండలాల వారీగా కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, అత్యవసర పరిస్థితుల్లో నాయకులు, కార్యకర్తలు వెంటనే స్పందించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కిడ్నీ బాధితులు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ …చెడు అలవాట్లకు దూరంగా వుండాలని సూచించారు.
తిరువూరు నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ నిధులతో సుమారు రూ.32 కోట్ల వ్యయంతో రోడ్డు పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఆర్‌అండ్‌బీ, జడ్పీ, పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్లను గుర్తించి దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తిరువూరు నుంచి వెళ్లే నేషనల్ హైవేపై డివైడర్, సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు అనుమతులు లభించాయని, రామచంద్రపురం నేషనల్ హైవేలో తక్షణ రిపేర్లు చేపట్టి త్వరలో కొత్త రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. విస్సన్నపేట–లక్ష్మీపురం నేషనల్ హైవేకు శాశ్వత రోడ్డు మంజూరైందని, పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.
తిరువూరు పట్టణానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.140 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇబ్రహీంపట్నం నుంచి నీటి వనరులపై సమగ్ర అధ్యయనం కొనసాగుతోందని ఎంపీ వివరించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో యానిమల్ హాస్టల్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో తిరువూరులో కూడా ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నవోదయ పాఠశాల భవన నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు.
ప్రతినెలా సుమారు 650 మందికి ఈ కిట్స్ పంపిణీ చేయనున్నామన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామంలోనూ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసి ప్రతినెలా ప్రభుత్వం ఎలా అయితే పింఛను పంపిణీ చేస్తుందో అదే విధంగా ప్రతి వ్యాధిగ్రస్తుని ఇంటికి వెళ్లి పౌష్టికాహార కిట్లను పంచి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో భాగస్వామ్యం కల్పించనున్నామన్నారు.
“కిడ్నీ వ్యాధి రహిత ఏ కొండూరు – కిడ్నీ వ్యాధి రహిత తిరువూరు నియోజకవర్గమే మా లక్ష్యం. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధే మా ప్రాధాన్యం” అని ఎంపీ స్పష్టం చేశారు.అలాగే ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నెఫ్రాలజిస్టు సేవలను మరింత విస్తృతం చేశామని.. మెరుగైన వైద్య సహాయంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యాధి లక్షణాలతో ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గిరిజనుల్లో వారి ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమశిక్షణాయుత జీవనశైలిని అలవరుచుకోవాలని కోరారు.
కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 రకాలతో కూడిన పౌష్టికాహార కిట్లను ప్రతినెలా వ్యాధిగ్రస్తులకు అందించి, తద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఎ.కొండూరు పరిసర ప్రాంతంలో ప్రస్తుతం 23 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నామని సీరం క్రియాటిన్ 2 శాతంతో 175 మంది, 1.5 శాతంతో 81 మంది చికిత్స పొందుతున్నారని, వ్యాధిగ్రస్తులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
ఆర్డీవో మాధురి మాట్లాడుతూ కేశినేని ఫౌండేషన్ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. కిడ్నీ సమస్య భారిన పడుతున్న పేషంట్స్ వంశపారంపర్యంగా రావటం లేదు…వాళ్ల అలవాట్లు ప్రధాన కారణం..వాటి మానుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 38 హ్యాబిటేషన్ గ్రామాలకు కృష్ణా వాటర్ సప్లై చేయటం జరుగుతుందన్నార.
అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ కలెక్టర్ లక్ష్మీశా సూచనలతో నెఫ్రాలజిస్ట్ లను సంప్రదించి కిడ్నీ బాధితులకు ఉపయోగపడే విధంగా ఈ పౌష్టికాహారం ప్లాన్ చేయటం జరిగిందన్నారు. కేశినేని ఫౌండేషన్ ద్వారా కిడ్నీ బాధితులకు పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎ.కొండూరు గ్రామ సర్పంచ్ వెంపాటి రజనీ,ఎ.కొండూర మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భరోతు ప్లీకా నాయక్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, ఎపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, స్టేట్ హౌజ్ కమిటీ డైరెక్టర్ ఎస్.కె. హుస్సెన్, జనసేన నియోజకవర్గ సమన్వయ కర్త మనుబోలు శ్రీనివాసరావు, బిజెపి తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రామచంద్రరావు ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి ఎ.రమేష్ రెడ్డి,ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాణావత్తు భీమానాయక్, తిరువూరు పట్టణ అధ్యక్షుడు మల్లెలశ్రీనివాసరావు, విసన్నపేట మండల పార్టీ అద్యక్షుడు రాయల సుబ్బారావు, తిరువూరు రూరల్ పార్టీ అధ్యక్షుడు దుబ్బాక వెంకటేశ్వరరావు, గ్రామ టిడిపి అధ్యక్షుడు వెంపటి స్వామి, ఎ.కొండూరు మండల తెలుగుదేశం పార్టీ ప్రదాన కార్యదర్శి జి.రాంప్రసాద్ రెడ్డి, జనసేన ఎ.కొండూరు మండల పార్టీ అధ్యక్షుడు ఎల్. విజయ్, , టిడిపి ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి ఆకుల రాధకృష్ణ, టిడిపి నాయకులు బొద్దుకుళ్ల ప్రేమనాథ్, తాళ్లూరు రామారావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ తిరుమల కుమార్, స్థానిక తహసీల్దార్ అరవింద్, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు,మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ స్వాతి, డాక్టర్ దివ్య లతో పాటు తదితరలు పాల్గొన్నారు.
