భారత రాజకీయ క్షేత్రంలో దశాబ్దాలుగా ‘కులగణన’ అనేది ఒక ప్రధాన అస్త్రంగా ఉంటూ వస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త ఆలోచన చిగురించింది. అదే ‘స్కిల్ సెన్సస్’ (నైపుణ్య గణన). అభివృద్ధి చెందుతున్న సమాజంలో యువతకు ఏం కావాలో గ్రహించి, నారా లోకేష్ గారు ప్రతిపాదించిన ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నేటి బ్రతుకు పోరాటంలో.. కులం కూడు పెట్టదు(కడుపు నింపదు) అని అన్ని కులాలకు తెలిసివస్తోంది.
నారా లోకేష్ గారు పూణే పబ్లిక్ పాలసీ ఫెస్టివల్ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని అంగీకరించారు. మంగళగిరిలో ‘స్కిల్ సెన్సస్’ను ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పుడు ఎదురైన సవాళ్లను ఆయన దాచుకోలేదు. సాంప్రదాయ పద్ధతుల్లో లక్షలాది మంది యువతలో దాగి ఉన్న విభిన్న నైపుణ్యాలను అంచనా వేయడం అంత సులభం కాదని ఆయన గుర్తించడం.. ఆయనలోని పరిణతి చెందిన నాయకుడిని చూపిస్తోంది. లోపాలను ఒప్పుకున్నప్పుడే కదా, సరైన పరిష్కారం దొరుకుతుంది!
ప్రపంచం ఐదవ పారిశ్రామిక విప్లవం వైపు అడుగులు వేస్తోంది. ఇలాంటి తరుణంలో మన యువత దగ్గర ఏ నైపుణ్యం ఉంది? అంతర్జాతీయ మార్కెట్‌కు కావాల్సిన అర్హతలు మన వాళ్ల దగ్గర ఉన్నాయా? అన్నది చాలా కీలకం.
ఏ గ్రామంలో ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు? ఎంతమంది కోడింగ్ చేయగలరు? ఎంతమందికి మార్కెటింగ్ తెలుసు? అనే కచ్చితమైన గణాంకాలు ఉంటే, పరిశ్రమలకు కావాల్సిన మానవ వనరులను అందించడం సులభమవుతుంది.
కేవలం ఓట్ల రాజకీయాల కోసం కాకుండా, రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకత్వం అవసరం. కులం ప్రాతిపదికన మనుషులను విభజించడం కంటే, వారి నైపుణ్యం (Skill) ఆధారంగా వారికి గుర్తింపునిచ్చి, ప్రోత్సహించడం ఆధునిక ప్రజాస్వామ్యానికి అసలైన నిదర్శనం. లోకేష్ గారు ప్రస్తావించిన ఈ ‘స్కిల్ సెన్సస్’ గనుక విజయవంతంగా అమలు జరిగితే, అది దేశానికే ఒక రోల్ మోడల్‌గా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు.




