కోడి పందాలు, జూదం, నిషేధిత ఆటలపై కఠిన చర్యలు
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులు, బంధువులు మిత్రులతో ప్రశాంతంగా జరుపుకోవాలి
సంక్రాంతి వేళ ప్రత్యేక నిఘా – మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్
సంక్రాంతి పండుగను శాంతియుతంగా, సుఖసంతోషాలతో జరుపుకోవాలని మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ప్రజలను కోరారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో, గ్రామీణ సీఐ ఏవీ బ్రహ్మం సూచనలతో పండుగ సందర్భంగా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.సంక్రాంతి రోజుల్లో కోడి పందాలు, జూదం, గుండాట వంటి నిషేధిత ఆటలు నిర్వహించినా.
వాటిలో పాల్గొన్నా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు మండల పరిధి అంతటా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.నిర్మానుష ప్రాంతాలు, పొలాలు, గ్రామ శివార్లలో నిషేధిత ఆటలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక పోలీస్ బృందాలతో దాడులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. యువత కోడి పందాలు.
జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇవి కుటుంబాలు, సమాజాన్ని నష్టపరిచే ప్రమాదం ఉందని తెలిపారు.అదేవిధంగా మద్యం సేవించి అల్లరి సృష్టించే అసాంఘిక శక్తులపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లే వారు తమ వివరాలను సమీప పోలీస్ స్టేషన్కు ముందుగానే తెలియజేయాలని సూచించారు. ఇది భద్రతా పరంగా ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
మండల పరిధిలో ఎక్కడైనా కోడి పందాలు లేదా నిషేధిత ఆటలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే పండుగను ప్రశాంతంగా నిర్వహించవచ్చని, పోలీస్ శాఖ ప్రజల భద్రతకే ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ స్పష్టం చేశారు.




