Home South Zone Telangana ఇళ్ల భద్రత కోసం సీసీటీవీ పరిశీలన అవసరం |

ఇళ్ల భద్రత కోసం సీసీటీవీ పరిశీలన అవసరం |

0

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి….సీసీటీవీ కెమెరాల పనితీరును తప్పనిసరిగా పరిశీలించాలి

ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లకు చెందిన ప్రజలు పండుగలు, సెలవులు, వివాహాలు తదితర సందర్భాల్లో ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని,చోరీలు మరియు ఇతర నేరాలు జరగకుండా స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో సూచించారు.

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ముందు తలుపులు,కిటికీలు, గేట్లు సక్రమంగా మూసి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలని తెలిపారు.అలాగే ఇళ్లలో లేదా ఇంటి పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా, రికార్డింగ్ జరుగుతోందా,నైట్ విజన్ సదుపాయం సక్రమంగా ఉందా అనే అంశాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు.

సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తే నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో భయాన్ని కలిగించడంతో పాటు,ఏదైనా అనుకోని ఘటన జరిగినా నిందితులను గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతాయని సీపీ పేర్కొన్నారు. ఇంటర్నెట్ సదుపాయం కలిగిన సీసీటీవీ కెమెరాలైతే మొబైల్ ఫోన్ యాప్ ద్వారా లైవ్ ఫుటేజ్ వీక్షించే విధంగా ముందుగానే సెటప్ చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా,ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే విషయాన్ని పొరుగువారికి లేదా నమ్మకమైన వ్యక్తికి ముందుగా తెలియజేయడం, అవసరమైతే సంప్రదింపు ఫోన్ నంబర్ ఇవ్వడం భద్రతకు మరింత దోహదపడుతుందని తెలిపారు.రాత్రి సమయాల్లో ఇంటి వెలుపల లైట్లు వెలిగేలా టైమర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇల్లు ఖాళీగా ఉందనే అనుమానం కలగకుండా ఉంటుందని వివరించారు.

ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కదలికలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని,లేదా డయల్ 100 లేదా 112కు ఫోన్ చేయాలని పోలీస్ కమిషనర్ ప్రజలను కోరారు.ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమవుతుందని, ప్రతి పౌరుడు భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

NO COMMENTS

Exit mobile version