గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు నేరచరిత్ర కలిగిన వారికి పోలీస్ మార్క్ కౌన్సెలింగ్ నిర్వహించిన గుంటూరు జిల్లా పోలీసులు. 📍సాధారణ కౌన్సిలింగ్ గా భ్రమించి హాజరైన వారికి రౌడీ షీటర్లు నేరచరిత్ర కలిగిన వారికి పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ రుచి చూపించిన గుంటూరు జిల్లా పోలీసులు.
📍 కౌన్సెలింగ్ అనంతరం, గుంటూరు నగరంలోని లక్ష్మిపురంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు పరేడ్ నిర్వహించగా, “పోలీస్ మార్క్ కౌన్సెలింగ్” రౌడీ షీటర్ల లో కనపడింది.
ప్రజా శాంతికి భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టానికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.
మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లాలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వాటిని అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రజలకు డయల్ 112 వంటి హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయని, రౌడీయిజం లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు జరిగితే నిమిషాల్లోనే పోలీసుల దృష్టికి చేరుతాయని తెలిపారు.
రౌడీ, KD, DCల కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, అవసరమైతే PD యాక్ట్ వంటి కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని, నేరాలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని సూచించారు.
నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందించామని, మారుమూల ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు, బీట్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులపై నిఘా పెంచామని, భవిష్యత్తులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కౌన్సెలింగ్ సమయంలో, సంబంధిత వ్యక్తులు ప్రస్తుతం జీవిస్తున్న విధానం, జీవనోపాధి కోసం చేస్తున్న వృత్తులపై పోలీసులు ఆరా తీశారు.
ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తమ ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు, గొడవలు, అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. 🚔 జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచడమే లక్ష్యంగా, శాంతి భద్రతల పరిరక్షణ కోసం గుంటూరు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.




