మహారాష్ట్రకు చెందిన 5 గురు సభ్యుల డెకాయిటీ గ్యాంగ్‌ను చకచక్యంగా అదుపులోకి తీసుకున్న బాపట్ల జిల్లా పోలీసులు ఎస్పీ శ్రీ బి.ఉమా మహేశ్వర్ ఐపీఎస్ గారి నేతృత్వంలో కొనసాగిన ప్రత్యేక ఆపరేషన్
బాపట్ల జిల్లా: మహారాష్ట్రకు చెందిన 5 గురు సభ్యుల డెకాయిటీ గ్యాంగ్‌ను చకచక్యంగా అదుపులోకి తీసుకున్న బాపట్ల జిల్లా పోలీసులు ఎస్పీ శ్రీ బి.ఉమా మహేశ్వర్ ఐపీఎస్ గారి నేతృత్వంలో కొనసాగిన ప్రత్యేక ఆపరేషన్. ముఠా సభ్యుల వద్ద నుంచి రూ.6,72,700/- నగదు, ఒక కత్తి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం
బ్యాంకు మేనేజర్ నుంచి దోచుకున్న ఎనిమిది లక్షల నగదుతో తిరుపతి బయలుదేరిన డెకాయిటీ గ్యాంగ్
అత్యంత వేగంగా స్పందించి గ్యాంగ్ సభ్యులను పట్టుకున్న బాపట్ల జిల్లా పోలీసులు
బాపట్ల జిల్లా పోలీసుల ప్రతిభను, జిల్లా ఎస్పీ గారి నాయకత్వాన్ని ప్రశంసించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు
శనివారం సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో బాపట్ల జిల్లాలోని బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్ల వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ప్రజలంతా ఏమి జరిగిందో అనుకుంటున్న సమయంలో, అప్పుడే బాపట్ల రైల్వే స్టేషన్ కు వచ్చిన కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలును బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం ఆకస్మికంగా తనిఖీ చేసి మహారాష్ట్రలో డెకాయిటీ చేసి వస్తున్న గ్యాంగ్‌ను అత్యంత చాకచక్యంగా, నైపుణ్యంతో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6,72,700/- నగదు, ఒక కత్తి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల రైల్వేస్టేషన్ లో ట్రైన్ ఆగి, తిరిగి ప్రయాణించే లోపే కేవలం 3 నిమిషాలలోనే రద్దీగా ఉన్న ట్రైన్ లోని డెకాయిటీ గ్యాంగ్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న బాపట్ల జిల్లా పోలీసులు తీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేసి, ప్రశంసించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమా మహేశ్వర్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ, మహారాష్ట్ర రాష్ట్రం హింగోలి నగరం మరియు జిల్లా పరిధిలోని మహారాష్ట్ర మధ్యవర్తి సహకారి కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ వద్ద నుంచి ఎనిమిది లక్షల రూపాయలు డెకాయిటీ చేసి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తున్నారనే సమాచారంతో, మహారాష్ట్ర పోలీస్ శాఖ అభ్యర్థన మేరకు సమాచారం అందిన వెంటనే బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
బాపట్ల మరియు చీరాల రైల్వే స్టేషన్ల వద్ద డీఎస్పీ స్థాయి అధికారులతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలును ఏకకాలంలో ఆకస్మికంగా తనిఖీ చేసి రైలులో ప్రయాణిస్తున్న ఐదుగురు సభ్యులున్న డెకాయిటీ గ్యాంగ్‌ను ముఠాను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.6,72,700/- నగదు, ఒక కత్తి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ ముఠా సభ్యులను, అలాగే స్వాధీనం చేసుకున్న నగదు మరియు వస్తువులను మహారాష్ట్ర పోలీస్ శాఖకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. పండుగ సెలవుల నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉన్న రైలులో నుంచి కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్న బాపట్ల జిల్లా పోలీసుల చురుకుదనాన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో తక్షణమే స్పందించి, చాకచక్యంగా వ్యవహరించిన సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ గారిని, బాపట్ల పట్టణ ఇన్స్పెక్టర్ రాంబాబు గారిని, ఎస్‌ఐ విజయ్ కుమార్ గారిని, పోలీస్ సిబ్బందిని, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని మరియు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
#Narendra
