కర్నూలు : కర్నూలు సిటీ :
క్రీడలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు ప్రారంభం• ఉద్యోగుల్లో సమన్వయం, పరస్పర సహకారం పెంపునకు దోహదంక్రీడల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి తగ్గి, ఉత్సాహం.
సానుకూల దృక్పథం పెరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శనివారం మున్సిపల్ ఉద్యోగుల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కమిషనర్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. విధుల ఒత్తిడికి దూరంగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. క్రీడలు ఉద్యోగుల్లో సమన్వయం, పరస్పర సహకారం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్, కౌన్సిల్ హాల్, ఇండోర్ స్టేడియం, ఔట్‌డోర్ స్టేడియంలలో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. పురుష ఉద్యోగుల కోసం క్రికెట్, షటిల్, వాలీబాల్, క్యారమ్స్, చెస్, క్రీడలు, మహిళా ఉద్యోగుల కోసం త్రోబాల్, బ్యాడ్మింటన్, 100 మీటర్ల రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, రంగోలి, షటిల్ క్రీడలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఈ క్రీడా పోటీలు నిర్వహించి, సంక్రాంతి పండుగ నాడు మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. జట్టు స్పూర్తి, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన పోటీ భావన ఉద్యోగుల పనితీరును మెరుగుపరుస్తాయని పేర్కొంటూ.
మున్సిపల్ ఉద్యోగులందరూ ఈ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, కార్యదర్శి నాగరాజు, ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిసిపి వెంకటరమణ, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, ఆర్‌ఓ జునైద్ తదితరులు పాల్గొన్నారు.




