కర్నూలు
పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• 250 కి పైగా ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపు• 15 జెసిబిలతో 2వ విడత స్పెషల్ డ్రైవ్నగర పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం సాధ్యమని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పేర్కొన్నారు. 7, 12, 14 శానిటేషన్ డివిజన్ల పరిధిలోని 127 ఖాళీ స్థలాలతో పాటు నగర వ్యాప్తంగా 250 కి పైగా ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కల తొలగింపునకు 15 జెసిబిలతో ఆదివారం 2వ విడత స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బళ్ళారి చౌరస్తా వద్ద కమిషనర్ జెండా ఊపి ఈ డ్రైవ్‌ను ప్రారంభించారు.
అనంతరం షరీన్‌నగర్, వెంకటరమణ కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న శుభ్రత పనులను స్వయంగా పరిశీలించారు. వెంకటరమణ కాలనీలోని ఓ ఖాళీ స్థలంలో విస్తారంగా పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు వియల్‌టి చెల్లించకపోవడం, మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో, ఆ స్థలాన్ని పూర్తిగా శుభ్రపరచి నగరపాలక సంస్థ అవసరాలకు వినియోగించుకోవాలని శానిటేషన్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
స్థలానికి పక్కనే ఉన్న ఓ ఆసుపత్రి నిర్వాహకులు ఆ స్థలంలో సి అండ్ డి వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలు వేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంపై ట్రేడ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో పేరుకుపోతున్న పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని అన్నారు.
దోమలు, పాములు, విషకీటకాలు విపరీతంగా పెరిగి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఖాళీ స్థలాల శుభ్రత అత్యంత అవసరమని స్పష్టం చేశారు. అందుకే పిచ్చి మొక్కల తొలగింపునకు 2వ విడత స్పెషల్ డ్రైవ్‌ను క్రమబద్ధంగా చేపట్టామని తెలిపారు.
2వ విడతలో తొలుత మూడు శానిటేషన్ డివిజన్ల పరిధిలో వంద శాతం ఖాళీ స్థలాల శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చామని, అనంతరం నగర వ్యాప్తంగా మొత్తం 250 కి పైగా ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, స్వచ్ఛత పనులు చేపట్టామని వివరించారు.
ఖాళీ స్థలాల యజమానులు తప్పనిసరిగా తమ స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని, నిర్లక్ష్యం వహిస్తే నోటీసులు, జరిమానాలు, అవసరమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం నగరపాలక సంస్థ బాధ్యతతో పాటు ప్రజల సామూహిక బాధ్యత అని పేర్కొంటూ, ప్రజల సహకారంతోనే ఆరోగ్యకరమైన నగరంగా కర్నూలును తీర్చిదిద్దగలమని కమిషనర్ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ పవన్ కుమార్ రెడ్డి, టిఏఈ రాంమోహన్, శానిటేషన్ ఇంస్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.




