నగరాభివృద్థికి డీపీఆర్ సిద్ధమైన వెంటనే నిధులు
మున్సిపల్ శాఖా మంత్రితో సమావేశమైన ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్,బొండా ఉమ, సుజనా చౌదరి*
అమరావతికి ముఖద్వారంగా ఉన్న విజయవాడ నగరాభివృద్థికి ఎన్ని వేల కోట్ల రూపాయాలు అయినా మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో మున్సిపల్‌శాఖా మంత్రి పి.నారాయణతో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్, బొండా ఉమామహేశ్వరరావు, సుజానా చౌదరి, బోడే ప్రసాద్‌లతో నగరాభివృద్థిపై మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ నగరాభివృద్థికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారన్నారు. విజయవాడ అభివృద్థికి చెన్నైకు చెందిన ఐఐటీ నిపుణులతో డీపీఆర్ సిద్ధం చేయిస్తున్నామన్నారు. విజయవాడ నగర వాసుల అవసరాలు అన్ని తీరే విధంగా డీపీఆర్‌న సిద్దం చేస్తున్నారన్నారు.
నగరంలోని ఎక్కడ వంతెనలు నిర్మాణం చేయాలి, రహదారులు ఎక్కడ విస్తరించాలి, మరుగునీటి కాలువలు, ఆర్వోబీలు, ప్లై వోవర్ల నిర్మాణంతో పాటుగా స్ట్రామ్ వాటర్ డ్రైయిన్లు నిర్మాణాల గురించి ఈ డీపీఆర్‌లో ఉన్నాయన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఈ డీపీఆర్ సిద్ధం కావడానికి కొంత సమయం పడుతుందని మున్సిపల్ అధికారులు తెలియజేశారన్నారు.
ఈ విషయంపై మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ డీపీఆర్ సిద్ధం అయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్ళి నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని చెప్పారన్నారు.
డీపీఆర్ సిద్ధం అయిన వెంటనే ఎన్ని నిధులు కావాలో అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. విజయవాడ అభివృద్థికి ఎన్ని వేల కోట్లు నిధులు అయినా మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.




