Home South Zone Andhra Pradesh ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జీవోలు దగ్ధం

ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జీవోలు దగ్ధం

0

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవోలు దహనం*

భోగిమంటల్లో జీవో 590, 847 ప్రతుల దహనం*

రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (పీ–పీ–పీ) విధానం పేరుతో నూతన వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు తీసుకువచ్చిన జీవో నంబర్లు 590, 847లను సిపిఐ నాయకులు భోగిమంటల్లో దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం భోగి పండుగ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని ద్వారక నగర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు..ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ, ప్రభుత్వమే భూములు, భవనాలు, మౌలిక వసతులు కల్పించి, చివరకు వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అన్యాయమని విమర్శించారు. రెండేళ్ల పాటు సిబ్బంది వేతనాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండటం ప్రజాధన దుర్వినియోగమని అన్నారు. పీ–పీ–పీ విధానం వల్ల పేద, సామాన్య, మధ్యతరగతి విద్యార్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సిపిఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం ద్వారా పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు, జీవోలను అమలు చేస్తోందని ఆరోపించారు. ఉక్కు కంపెనీలను కూడా కార్పొరేట్లకు అప్పజెప్పి దేశ సంపదను వారి చేతుల్లో పెట్టుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సిపిఐ మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు మాట్లాడుతూ, సిపిఐ పార్టీ 100 సంవత్సరాలుగా ప్రజల పక్షాన పోరాడుతూ ఎన్నో విజయాలు సాధించిందన్నారు. రానున్న మరో వందేళ్ల పాటు కూడా సిపిఐ సజీవంగానే కొనసాగుతుందని చెప్పారు.

ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది ఎర్రజెండా పార్టీనేనని వ్యాఖ్యానించారు. ఈ నెల 18న ఖమ్మంలో జరగనున్న సిపిఐ శత వార్షికోత్సవాల ముగింపు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి నందం బ్రహ్మేశ్వరరావు మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్పు ద్వారా నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాలుగో వార్డు శాఖ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ, కోడూరు శివాజీ, ఉయ్యాల సత్యనారాయణ, పంతగాని మరియదాసు, నందం హరికృష్ణ, మల్లూరి వాసు, ఆకురాతి శ్రీనివాసరావు, బాపనపల్లి శ్రీనివాసరావు, బాపనపల్లి వెంకటేశ్వరరావు, బాపనపల్లి అంజిబాబు, సుబ్బారావు, ముక్కంటి, ఎం సిపిఐ నాయకులు కూర జాన్ బాబు తదితర సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version