పేదల కళ్ళలో సం’క్రాంతి’ వెలుగులు…
సంక్రాంతి కానుకగా పేదలకు ఇళ్ల పట్టాలు..
నెరవేరిన నాలుగు దశాబ్దాల పేదల కల…
అంతులేని ఆనందం…
తడిబారిన కళ్ళతో లబ్దిదారుల హర్షాతిరేకాలు…
భావోద్వేగాలను అదుపు చేసుకోలేని ఒక ఆనందకరమైన పరిస్థితి. నాలుగు దశాబ్దాల కాలంగా నెరవేరని కల నేడు నిజమైంది. విజయవాడ నగరంలో మధ్య నియోజకవర్గంలో 58 డివిజన్ ప్రజలకు దశాబ్దాల పాటు ఎటువంటి చట్టబద్ధతలేని స్థలంలో గూడు నిర్మించుకుని నివాసం ఉంటున్న నిరుపేదలకు ఆనందాన్ని పంచే సంక్రాంతి పండుగ ముందే వచ్చింది.
నాలుగున్నార దశాబ్దాల తర్వాత ప్రభుత్వ స్థలాల్లో చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకొని నివాసం ఉంటున్న 51 మంది పేద నివాసితులకు కూటమి ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తూ జిఓ నెంబర్ 30 నిబంధనల ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే నంబరు 24/10బి, 27/1బి లో 86.39 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు 70 కుటుంబాల వారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గృహాలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.
ఆక్రమణ స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ఆఘమేఘాల మీద అమలులోకి తీసుకు రావడంతో పాటు సంక్రాంతి కానుకగా 51 మంది లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆర్థిక అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టిందని వివరించారు.
ఇది పేదల ప్రభుత్వమని, పేదల ఆర్థిక అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. అణగారిన వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పి 4 పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను పేద ప్రజలు అందిపుచ్చుకొని తమ తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ఇప్పటివరకు శాశ్వతవాసాలు నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఉన్న నివాసితులు ఇకముందు ధైర్యంగా తమ శక్తి మేరకు శాశ్వత నివాసాలు నిర్మించుకోవచ్చని తెలిపారు.
స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో నందమూరి నగర్ నివాసితులు ఈ ప్రాంత స్థలాలకు పట్టాలు కావాలని కోరిన నేపథ్యంలో అప్పుడు వారికి ఇచ్చిన హామీ నేడు నిజం చేశానన్నారు. నియోజకవర్గంలో ప్రజల మౌలిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత తనదేనన్నారు. సూపర్సిక్స్ హామీలలో భాగంగా చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తున్నామన్నారు.
పేద ప్రజల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకొని పనిచేస్తుందన్నారు. ఇకనుంచి నందమూరి నగర్ వాసులు ధైర్యంగా తమ తమ ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకోవచ్చన్నారు. నగరపాలక సంస్థ నుంచి ఇంటి ప్లాన్లు, బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందేందుకు ఈ పట్టాలు ఉపయోగపడతాయన్నారు. పట్టాలు కొందరు లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం వెలకట్టలేనిదన్నారు. నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా తక్షణం స్పందించేందుకు ఈ ప్రాంతంలో కూడా ఒక కార్యాలయం ఏర్పాటు చేశానన్నారు.
కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, ఉత్తర మండలం ఎమ్మార్వో సూర్యా రావు, నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, మాజీ కార్పొరేటర్ ఎరుబోతు శ్రావణి, స్థానిక నాయకులు బి. ఆర్. సోమేశ్వరరావు, ఆళ్ళ రామారావు, నవనీతం సాంబశివరావు సహా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.




