Wednesday, January 14, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో 10 కోట్లు జమ |

సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో 10 కోట్లు జమ |

సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో రూ.10,000 కోట్లకు పైగా జమ
స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్‌కు నిదర్శనం

ధాన్యం కొనుగోలులో చారిత్రక విజయం సాధించిన కూటమి ప్రభుత్వం-
అమరావతిపై జగన్మోహన్ రెడ్డి ది దుష్ప్రచారం-
రాష్ట్ర ప్రజలకు, రైతు సోదరులకు సంక్రాంతి
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్

తెనాలి, 13-జనవరి-2026:
ఖరీఫ్ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,76,848 మంది రైతుల నుంచి 41.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఇప్పటికే రూ.9,789 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయగా, సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రూ.10,000 కోట్లకు పైగా ధాన్యం కొనుగోలు చెల్లింపులు పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు.

తెనాలిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రైతు సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త మైలురాయిని సాధించిందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో కష్టపడి పండించిన ధాన్యానికి నెలల తరబడి డబ్బులు రాక రైతులు దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతులకు చెల్లించాల్సిన రూ.1,674 కోట్ల బకాయిలను పెండింగ్‌లో ఉంచిన ఘనత గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.

ఈ పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు.
రైతుకు నచ్చిన మిల్లులోనే ధాన్యం విక్రయించే స్వేచ్ఛ
విక్రయించిన 24–48 గంటల్లోనే నగదు నేరుగా రైతు ఖాతాలో జమ
తేమ శాతం సమస్యలు తొలగించేందుకు రైతు సహాయ కేంద్రాలు, మిల్లుల్లో ఒకే రకమైన యంత్రాల ఏర్పాటు
వంటి కీలక సంస్కరణలు అమలు చేశామని తెలిపారు.

జిల్లాల వారీగా అద్భుత పురోగతి
గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వ చివరి ఏడాదిలో 552 మంది రైతుల నుంచి 5,913 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కాగా, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం 11,700 మందికి పైగా రైతుల నుంచి 76,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో 98 శాతం, కాకినాడ జిల్లాలో 97 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని తెలిపారు.
తెనాలి నియోజకవర్గంలో చారిత్రక విజయం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ చివరి సంవత్సరంలో తెనాలి నియోజకవర్గంలో కేవలం 29 మంది రైతుల నుంచి 288 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి, రూ.63 లక్షలు ఖర్చు చేశారని గుర్తు చేశారు.
అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటివరకు 3,884 మంది రైతుల నుంచి 23,463 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.51 కోట్ల 76 లక్షలను 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసిందన్నారు.

29 మంది రైతులు ఎక్కడ – 3,884 మంది రైతులు ఎక్కడ?
రూ.63 లక్షలు ఎక్కడ – రూ.51.76 కోట్లు ఎక్కడ?
ఈ లెక్కలే పాలనలో వచ్చిన మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,572 కొనుగోలు కేంద్రాలు, వేలాది లారీలు–ట్రాక్టర్లు, లక్షలాది హమాలీలు, రైతు కూలీల సమన్వయంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు ఇబ్బంది పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు సదుపాయం కల్పించి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలింపు చేపట్టామని తెలిపారు.

తొలిసారిగా ఇంటర్-డిస్ట్రిక్ట్ మూమెంట్ అమలు చేయడంతో వారం రోజుల్లోనే క్వింటాల్‌కు రూ.300–400 వరకు గిట్టుబాటు ధర పెరిగిందని తెలిపారు. దాదాపు 78 శాతం మంది రైతులకు నాలుగు గంటల్లోనే చెల్లింపులు జరిగాయని స్పష్టం చేశారు.

ప్రగతి బాటలో ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై అనవసర రాజకీయ విమర్శలు చేస్తూ, అమరావతి రాజధానిపై ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. గుంటూరు జిల్లాకు అసలైన ప్రత్యేకత అమరావతి రాజధానియే అని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, రైతు సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రావాలి, రైతు కుటుంబాల్లో పండుగ ఆనందం కనిపించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments