గుంటూరు జిల్లా పోలీస్…
కొత్తపేట పోలీస్ స్టేషన్
ఆటోలో మర్చిపోయిన సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు నగల సంచిని కేవలం 3 గంటల్లో గుర్తించి ప్రయాణీకురాలికి అప్పగించిన కొత్తపేట పోలీసులు
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి సమర్థ నాయకత్వంలో జిల్లా పోలీసులు ప్రజలకు వేగవంతమైన, నమ్మకమైన మరియు ఉత్తమ సేవలు అందిస్తున్నారనడానికి స్పష్టమైన ఉదాహరణ ఈ సంఘటన.*
సంఘటన వివరాలు:*
నిన్న (12.01.2026) మధ్యాహ్నం సమయంలో ఒక మహిళ తన చిన్న పిల్లలతో కలిసి చిలకలూరిపేటకు వెళ్లేందుకు పట్టాభిపురం హనుమయ్య కంపెనీ వద్ద ఆటో ఎక్కి గాంధీ పార్క్ వద్ద దిగారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు నగలతో కూడిన సంచిని ఆటోలోనే మర్చిపోయారు.
కొద్ది సేపటికి సంచి తన వద్ద లేదని గుర్తించిన ఆమె, ఆటో కోసం చుట్టుపక్కల వెతికినా ఆటో కనపడకపోవడంతో వెంటనే కొత్తపేట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి, జరిగిన విషయాన్ని సీఐ శ్రీ వీరయ్య చౌదరి గారికి తెలియజేస్తూ ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందిన వెంటనే సీఐ గారి ఆదేశాల మేరకు క్రైమ్ కానిస్టేబుళ్లు జానీ బాషా, శ్రీనివాసరావు, డేగల కోటేశ్వరరావు, అనిల్ కుమార్లు గాంధీ పార్క్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ, మహిళ ప్రయాణించిన ఆటోను గుర్తించే దిశగా విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు.
సుమారు మూడు గంటల పాటు కృషి చేసి, అనేక ఆటోలను పరిశీలించిన అనంతరం మహిళ ప్రయాణించిన ఆటోను గుర్తించి, ట్రాఫిక్ పోలీస్ విభాగం వారు ఆటోలకు కేటాయించిన “ట్రాఫిక్ పోలీస్ నంబర్” వివరాల ఆధారంగా ఆటో డ్రైవర్ను గుర్తించారు. అతని వద్ద నుంచి బంగారు నగల సంచిని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బంగారు నగల సంచిని కొత్తపేట సీఐ శ్రీ వీరయ్య చౌదరి గారి చేతుల మీదుగా సంబంధిత మహిళకు పోలీస్ సిబ్బంది అందజేయడం జరిగింది.
పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, గంటల వ్యవధిలోనే తన బంగారు నగల సంచిని తిరిగి అందించినందుకు ప్రయాణీకురాలు కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి గారికి, పోలీస్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పండుగ సమయంలో మహిళకు ఎదురైన ఆవేదనను తీరుస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన కొత్తపేట పోలీస్ వారిని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారితో పాటు నగర ప్రజలు ప్రశంసించారు.




