Home South Zone Telangana ఆర్మీ–ప్రభుత్వం మధ్య చర్చలే పరిష్కారం: రేవంత్ రెడ్డి

ఆర్మీ–ప్రభుత్వం మధ్య చర్చలే పరిష్కారం: రేవంత్ రెడ్డి

0

తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. వివిధ అంశాలకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు.

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” జరిగింది. భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, తెలంగాణ – ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (TASA) మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గారు, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి గారు సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో 2 నుంచి 4 సైనిక్ స్కూళ్లను మంజూరు చేశారన్న విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేస్తూ గడిచిన పదేళ్లలో తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని చెప్పారు. తెలంగాణలో తక్షణం సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు.

దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో కేంద్రానికి, భారత సైన్యానికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్‌ దామగుండం వద్ద లో-ఫ్రీక్వెన్సీ వీఎల్ఎఫ్ (VLF) నేవీ రాడార్ స్టేషన్‌కు 3 వేల ఎకరాలు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు.

NO COMMENTS

Exit mobile version