కర్నూలు: కర్నూలు సిటీ :
మొండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలి• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• పన్ను వసూళ్లకు మూడు ప్రత్యేక బృందాలు• దీర్ఘకాలిక బకాయిదారుల ఆస్తుల సీజ్, జప్తునగరంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను మొండి బకాయిదారులపై ఇకపై కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటివరకు ఇచ్చిన గడువులు.
ఉదాసీనత వైఖరి ఇక చాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులకు స్పష్టం చేశారు. ఆదివారం నగరపాలక కార్యాలయంలో రెవెన్యూ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.నగర అభివృద్ధి పనులు మరింత వేగవంతంగా ముందుకు సాగాలంటే నిధుల లభ్యత కీలకమని, అందుకు మొండి బకాయిల వసూళ్లు తప్పనిసరిగా జరగాలని కమిషనర్ స్పష్టం చేశారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అగ్ర మొండి బకాయిదారుల జాబితా సిద్ధం చేసి, వారి ఆస్తుల సీజ్, జప్తుకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ, ఆర్‌ఓ జునైద్ ఒక బృందంగా, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఆర్‌ఓ స్వర్ణలత మరో బృందంగా, కార్యదర్శి నాగరాజు, ఆర్‌ఓ వాజీద్ ఇంకో బృందంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ బృందాలకు ఆర్‌ఐలు, ఏఆర్‌ఐలు, అడ్మిన్‌లు సహాయకులుగా ఉండాలని సూచించారు.
ప్రతి బృందం ఉదయం రెండు, సాయంత్రం రెండు చొప్పున రోజుకు మొత్తం పన్నెండు ఆస్తులను సీజ్ చేసి, జప్తు ప్రక్రియను కొనసాగించాలని కమిషనర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ, కార్యదర్శి నాగరాజు, ఎస్‌ఈ రమణమూర్తి, రెవెన్యూ అధికారులు జునైద్, వాజీద్, ఎంహెచ్‌ఓ నాగప్రసాద్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ మంజూర్ బాష, ఆర్‌ఐలు, ఏఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.




