Chandrababu Naidu: ఆయన బెంగళూరులో ఉంటే అదే రాజధాని అవుతుందా?: సీఎం చంద్రబాబు
Chandrababu Slams Jagan on Capital Issue
ఎన్టీఆర్ 30వ వర్థంతి సభలో నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
ఎన్టీఆర్ సంక్షేమ బాటలోనే కూటమి ప్రభుత్వం పయనిస్తోందని వెల్లడి
ఏపీ రాజధాని అమరావతే అని ఉద్ఘాటన
గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు, ‘క్రెడిట్ చోరీ’ ఆరోపణల ఖండన
2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం
రాష్ట్రంలో రౌడీయిజం, అరాచకాలను ఉపేక్షించబోమని హెచ్చరిక
ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందా? మరి ఆయన (జగన్) ఎక్కువగా బెంగళూరులో ఉండేవారు, అటువంటప్పుడు దాన్నే రాజధానిగా ప్రకటించాల్సింది అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధాని విషయంలో గత పాలకులు సృష్టించిన గందరగోళానికి ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్థంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఏపీ రాజధాని అమరావతే
రాజధానిపై ఐదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడిందని చంద్రబాబు స్పష్టం చేశారు. “గత ఐదేళ్లుగా మన రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలో బతికాం. మూడు రాజధానులంటూ గందరగోళం సృష్టించారు. కానీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మూడు రాజధానుల నినాదం ఎక్కడైతే బలంగా వినిపించారో, అక్కడి ప్రజలు కూడా ఎన్డీయే అభ్యర్థులనే గెలిపించారు. ఇకపై ఎలాంటి అనుమానాలకు తావులేదు. ఎవరైనా ఏపీ రాజధాని ఏది అని అడిగితే, మనమంతా గర్వంగా, కాలర్ ఎగరేసి ‘అమరావతి’ అని చెప్పుకుందాం. ఇది మనందరి రాజధాని, ప్రజా రాజధాని, దేవతల రాజధాని” అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
యుగపురుషుడికి నివాళి
ఎన్టీఆర్ తెలుగు జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఏకైక నాయకుడని చంద్రబాబు కొనియాడారు. “ఎన్టీఆర్ మనకు భౌతికంగా దూరమై 30 ఏళ్లు గడిచినా, ఆయన స్ఫూర్తి మనతోనే ఉంది. ఒకప్పుడు మదరాసీలుగా పిలవబడిన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆయన ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు తీసుకెళ్లారు. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన యుగపురుషుడు ఆయన. విద్యావంతులను, మేధావులను రాజకీయాల్లోకి ఆహ్వానించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు” అని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
ఎన్టీఆర్ బాటలోనే సంక్షేమం
ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని చంద్రబాబు తెలిపారు. “ఆనాడు ఆయన రూ.2కే కిలో బియ్యం ఇచ్చి దేశంలో ఆహార భద్రతకు నాంది పలికారు. నేడు మేము అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. ఆయన రూ.35తో ప్రారంభించిన పింఛనును ఇప్పుడు రూ.4 వేలకు పెంచి గౌరవంగా అందిస్తున్నాం. ఆయన చూపిన బాటలోనే పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తున్నాం. ఇటీవల 3 లక్షల గృహ ప్రవేశాలు చేయించాం, ఉగాది నాటికి మరో 5 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తాం” అని వివరించారు.
భూ హక్కులకు తిరుగులేని భరోసా
ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. “గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. నాడు ఎన్టీఆర్ భూ రికార్డుల్లో పారదర్శకత కోసం మునసబు, కరణం వ్యవస్థను రద్దు చేస్తే, గత పాలకులు కొత్త అధికారులను సృష్టించి ప్రజల ఆస్తులు కొట్టేయాలని చూశారు. వారి కుట్రలను భగ్నం చేశాం. రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నాం. రీ-సర్వేను పక్కాగా పూర్తిచేసి, బ్లాక్ చైన్, క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయకుండా పటిష్టమైన భద్రత కల్పిస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.




