Home South Zone Andhra Pradesh అన్నమయ్య జిల్లాలో పండుగలో విషాదం |

అన్నమయ్య జిల్లాలో పండుగలో విషాదం |

0

అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో ఘటన
పందెం కట్టి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి టెక్కీలు
అతిగా తాగడమే మృతికి కారణమని పోలీసుల నిర్ధారణ
కొన్ని గంటల్లోనే 19 బీర్లు తాగినట్లు గుర్తింపు
సంక్రాంతి పండుగ వేళ అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగకు సొంతూరికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అతిగా మద్యం సేవించి మృతిచెందారు. ఈ ఘటన కంభంవారిపల్లి మండలం బండవడ్డిపల్లెలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. చెన్నై, బెంగళూరులో పనిచేస్తున్న మణికుమార్ (35), పుష్పరాజ్ (26) సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చారు. పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో మణికుమార్, పుష్పరాజ్ ఇద్దరూ పోటీపడి మద్యం సేవించారు. దీంతో కొద్దిసేపటికే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

ఇది గమనించిన స్నేహితులు వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. మొదట కల్తీ మద్యం కారణంగా మరణించారని ఆరోపణలు వచ్చినా, పోలీసులు వాటిని తోసిపుచ్చారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల మధ్య ఇద్దరూ కలిసి 19 బడ్‌వైజర్ టిన్ బీర్లు తాగారని, అతిగా మద్యం తాగడం వల్ల తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై మరణించారని ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఇదే విషయం స్పష్టమైందని పోలీసులు తెలిపారు.

మృతుడు మణికుమార్‌కు భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. పుష్పరాజ్‌కు ఇంకా వివాహం కాలేదు. పండుగ రోజున యువకులు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

NO COMMENTS

Exit mobile version