ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం పెంపు
సహకార సంఘంలో సభ్యులై, లైసెన్స్ ఉన్నవారే అర్హులు
ఏపీ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పించింది. చేపల వేటపై ఆధారపడి జీవించే మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు బీమా మొత్తాన్ని భారీగా పెంచింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం కింద ఇప్పటివరకు రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా పరిహారాన్ని ఏకంగా రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేట కోసం సముద్రంలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఈ నిర్ణయం ఆర్థికంగా అండగా నిలవనుంది.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల వేట సమయంలో జరిగే ప్రమాద మరణాలకు మాత్రమే రూ.10 లక్షల పరిహారం వర్తిస్తుంది. అదే సమయంలో సాధారణ మరణాలు లేదా ఇతర ప్రమాదాల్లో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కార్మిక శాఖ ద్వారా రూ.2 లక్షల పరిహారం అందుతుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మత్స్యకారులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మత్స్యకార సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. అలాగే, చేపల వేట లైసెన్స్ కలిగి ఉండటం కూడా తప్పనిసరి. సముద్రంలోకి వెళ్లే బోట్లలో పనిచేసే సిబ్బంది తమ పేర్లను మత్స్యశాఖ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి.
ఈ బీమా సాయం కోసం అర్హులైన వారు తమ ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం, పంచనామా రిపోర్ట్, రేషన్ కార్డు, సహకార సంఘం సభ్యత్వ ధ్రువీకరణ పత్రం, సంఘం తీర్మానం కాపీ వంటి పత్రాలను జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో లేదా రైతు సేవా కేంద్రాల్లో సమర్పించాలి. ప్రభుత్వం ఇప్పటికే వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం, రాయితీలపై బోట్లు, వలలు, ఇంజిన్లు వంటివి అందిస్తోంది. తాజాగా బీమా మొత్తాన్ని కూడా గణనీయంగా పెంచడం మత్స్యకార వర్గాలకు మరింత ధైర్యాన్ని ఇస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
