Home South Zone Andhra Pradesh పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పసుగణ రంగానికి పునర్ వైభవం

పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పసుగణ రంగానికి పునర్ వైభవం

0

పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశుగణ రంగానికి పునర్వైభవం
పశుగణ రంగమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారం
లింగ నిర్ధారిత వీర్యనాళికలతో పెయ్య దూడల ఉత్పత్తి పెంపు
గుడ్లు, పాలు, మాంస ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానం దిశగా అడుగులు
జన్మభూమి తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు, పశుపోషకులకు భరోసా
ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో శిబిరాల ఏర్పాటు
నిడ‌మానూరులో కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు
అమ‌రావ‌తి/నిడ‌మానూరు, జ‌న‌వ‌రి 19:* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుగణ రంగ అభివృద్ధికి కూట‌మి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని వ్య‌వ‌సాయ‌, పశుసంవర్ధక శాఖామాత్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు తెలిపారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నియంత్రణ మరియు పశుపోషణ ఖర్చుల తగ్గింపే లక్ష్యంగా జన్మభూమి తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ శిబిరాల కార్య‌క్ర‌మాన్ని విజయవాడ రూరల్ మండలంలోని నిడమానూరు గ్రామంలో సోమ‌వారం ఉదయం ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ‌ వెంకట్రావుతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, పశుపోషణ రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో పశువుల ఆరోగ్య సంరక్షణకు కూట‌మి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పశుపాలకులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తు చికిత్సలు చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కూట‌మి ప్రభుత్వం చేపట్టిందన్నారు.

పశువులకు ఉచిత వైద్య సేవలు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందుల పంపిణీతో పాటు శాస్త్రీయ పశు యాజమాన్యంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పశుగణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారంగా నిలుస్తోందని, ముఖ్యంగా మహిళల జీవనోపాధికి ఈ రంగం కీలకమని పేర్కొంటూ, పశుపోషకులకు పూర్తి భరోసా కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా ఏపీ పశు సంపదకు గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు, పుంగనూరు ఆవులు, గోదావరి గేదెలు, నెల్లూరు, మాచెర్ల గొర్రెలు, అశీల్ కోళ్లకు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 108.19 లక్షల ఆవులు, గేదెలు, 231.49 లక్షల గొర్రెలు, మేకలు (దేశంలో రెండవ స్థానం), 1078.63 లక్షల కోళ్లు ఉండగా, సుమారు 25 లక్షల రైతు కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు.

పశుగణ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.1,67,000 కోట్ల ఆదాయం లభిస్తోందని, ఇది 2024–25 ఆర్థిక సంవత్సరంలో జీవీఏలో 10.26 శాతంగా ఉన్నట్లు మంత్రి వివరించారు. పశుగణ ఉత్పత్తుల్లో రాష్ట్రం 2739 కోట్ల గుడ్ల ఉత్పత్తితో దేశంలో మొదటి స్థానం, 11.30 లక్షల మెట్రిక్ టన్నుల మాంస ఉత్పత్తితో నాలుగవ స్థానం, 139.40 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తితో ఏడవ స్థానంలో నిలిచిందని తెలిపారు.

గ్రామగ్రామాన ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

కూట‌మి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2025లో పశువుల ఆరోగ్య రక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధి నియంత్రణ, పశుపోషణ ఖర్చుల తగ్గింపు లక్ష్యంగా రాష్ట్రంలోని 13,257 గ్రామాలలో జన్మభూమి తరహాలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించామని మంత్రి తెలిపారు. ఈ శిబిరాల ద్వారా 10,48,980 పశువులకు వైద్య సేవలు అందించడంతో పాటు 5,36,387 మంది పశుపోషకులు లబ్ది పొందారని చెప్పారు.

అదే స్పూర్తితో ఈ ఏడాది జ‌న‌వ‌రి 19 నుంచి 31 వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ శిబిరాలలో పశువైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులకు చికిత్స, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిరోధక టీకాలు, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు శాస్త్రీయ పశు యాజమాన్యంపై అవగాహనా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్న పథకాలలో భాగంగా రూ.52 కోట్ల వ్యయంతో 1,29,800 మంది పశుపోషకులకు 23,302 మెట్రిక్ టన్నుల బలపాల పశుదాణాను 50 శాతం రాయితీపై పంపిణీ చేశామని, అలాగే రూ.28.32 కోట్లతో 4,111 టన్నుల పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై 1,22,833 మందికి అందించామని మంత్రి వివరించారు. ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడి ప‌శుగ్రాసానికి కూడా ఈ క్రాప్ చేసే విధంగా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని మంత్రి హ‌మీ ఇచ్చారు.

గోకులాల షెడ్లు, పశు బీమా, లింగ నిర్ధారిత వీర్యనాళికలు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానంగా 70–90 శాతం రాయితీతో ఇప్పటి వరకు 58,440 గోకులాల షెడ్లు నిర్మించామని, 2026–27లో మరో 50,000 షెడ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. పశుపోషకులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు 85 శాతం రాయితీతో పశు బీమా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.

పెయ్య దూడల ఉత్పత్తి పెంపుకోసం 50 శాతం రాయితీతో లింగ నిర్ధారిత వీర్యనాళికలను రూ.150కే అందిస్తూ ఈ ఆర్థిక సంవత్సరానికి 10 లక్షల వినియోగ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వంలో మ‌ర‌ణించిన ప‌శువుల‌కు కూట‌మి ప్ర‌భ‌త్వం 150 కోట్ల‌ న‌ష్ట ప‌రిహరం చెల్లించిద‌ని, ప్ర‌స్తుతం 3 సంవ‌త్స‌రాల‌కు గాను 1920 రూపాయ‌ల భీమాలో రైతు కేవ‌లం 288 రూ మాత్ర‌మే చెల్లించాల్సి ఉంటుంద‌ని మంత్రి తెలిపారు.

కూట‌మి ప్రభుత్వంతో పశుగణ రంగానికి పునర్జీవనం

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జన్మభూమి కార్యక్రమాల ద్వారా పశు ఆరోగ్య శిబిరాలు పండగ వాతావరణంలో నిర్వహించేవారని, గత ప్రభుత్వంలో ఈ రంగం పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి విమర్శించారు. మళ్లీ కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పశుగణ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ గత సంవత్సరం మంగళగిరి నుంచి ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువులకు పునర్వైభవం తీసుకువస్తామని.

ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది నియామకంపై త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చించి ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ కాంపౌండ్ వాల్ ను త్వ‌ర‌లోనే నిర్మించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు 104 నెంబ‌ర్ టోల్ ప్రీ నెంబ‌ర్ కు కాల్ చేస్తే వైద్య సేవ‌లు అందిస్తారో,,,1962 టోల్ ఫ్రీ నెంబ‌ర్ కు కాల్ చేస్తే ప‌శువుల‌కు వైద్యం అందించేందుకు అంబులెన్స్ లు గ్రామాల‌కు చేరుకుంటాయ‌ని వెల్ల‌డించారు.

వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పశుసంవర్ధక రంగం ముఖ్యంగా మహిళల జీవనోపాధికి కీలకమని పేర్కొన్న మంత్రి అచ్చెన్నాయుడు, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తుల్లో దేశంలో తొలి మూడు స్థానాల్లో నిలవాలనే దిశగా స్పష్టమైన కార్యాచరణ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ‌ వెంకట్రావు, మచిలీపట్నం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు.

గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, టిడిపి నాయకులు గొడ్డళ్ల చిన్న రామారావు, బండి వెంకట్రావు (నాని), దయాల రాజేశ్వరరావు, గూడపాటి తులసి మోహన్, కోనేరు నాగేంద్ర కుమార్, బిజెపి నాయకులు కురుమద్దాలి ఫణి కుమార్, కానూరి శేషు మాధవి, నాదెండ్ల మోహన్, ఉయ్యూరు వెంకటేశ్వరరెడ్డి, జనసేన పార్టీ నాయకులు పొదిలి దుర్గారావు, మేకల స్వాతి తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు: పిఆర్వో – వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రివర్యుల కార్యాల‌యం

NO COMMENTS

Exit mobile version