తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) గారి వర్థంతి సందర్భంగా విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా వెండితెరను ఏలిన కథానాయకుడిగానే కాకుండా, ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రిగా, పేదల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసిన మహానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రపుటల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని అన్నారు.
ప్రభుత్వం అంటే ప్రజలను భయపెట్టే యంత్రం కాదని, ప్రజలకు అండగా నిలిచే వ్యవస్థ అనే భావనను నాటిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. అలాంటి మహానాయకుడ్ని చూస్తూ తాను ఎదిగానని, ఈ రోజు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించడం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని మంత్రి అనిత పేర్కొన్నారు.
స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. తెలుగు ప్రజల కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అనిత స్పష్టం చేశారు.




