కర్నూలు సిటీ :
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• వార్డుల వారీగా ప్రగతి పనుల పురోగతిపై సమీక్ష• హాజరైన ఇంజనీరింగ్, అకౌంట్స్, అమినిటీస్ కార్యదర్శులునగరంలో వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, జాప్యానికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్
పి.విశ్వనాథ్ సూచించారు. మంగళవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఇంజనీరింగ్, అకౌంట్స్, అమినిటీస్ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు.నిధులు మంజూరు అయిన వెంటనే పనులు ప్రారంభించి, నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా అమినిటీస్ కార్యదర్శులు, ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ స్పష్టం చేశారు. పనుల్లో అనవసర జాప్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి అభివృద్ధి పనిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
పనులు దక్కించుకుని పనులు ప్రారంభించని గుత్తేదారులకు నోటిసులు జారీ చేయాలని, స్పందించకపోతే రద్దు చేసేయాలని స్పష్టం చేశారు. పనుల నమోదు, బిల్లుల సమర్పణ, చెల్లింపుల ప్రక్రియలు సకాలంలో పూర్తయ్యేలా అకౌంట్స్ విభాగం సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. విభాగాల మధ్య సమన్వయం లోపించకుండా ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
ప్రతి వార్డులో చేపట్టిన పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, సూపరింటెండెంట్ మంజూర్ బాష, డిఈఈలు, ఏఈలు, అకౌంట్స్ విభాగ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




