కర్తవ్యం జయశాంతి!
కన్నప్రేమnu kartavyaanni samanvayam chEsina మహిళా కానిస్టేబుల్ జయశాంతి స్ఫూర్తిగాథ!
ఖాకీ దుస్తులు ధరించినప్పుడు మాత్రమే కాదు, సాధారణ పౌరురాలిగా ఉన్నప్పుడు కూడా బాధ్యతను మర్చిపోని ఒక మహిళా కానిస్టేబుల్ కథ ఇది. కాకినాడ కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయి వేలాది మంది ఇబ్బందులు పడుతున్న వేళ, ఒక తల్లి తన బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ నియంత్రించిన తీరు యావత్ రాష్ట్రాన్ని కదిలించింది.
శనివారం సాయంత్రం కెనాల్ రోడ్డులో ఒక లారీ మొరాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో లేకపోయినా, తన రెండున్నరేళ్ల కుమారుడిని ఎత్తుకుని ఉన్నప్పటికీ, జయశాంతి వెనకడుగు వేయలేదు. ఒకవైపు కన్నప్రేమ, మరోవైపు ప్రజాసేవ.. ఆ రెండింటినీ సమన్వయం చేస్తూ ఆమె గంటల తరబడి ట్రాఫిక్ ను చక్కదిద్దిన దృశ్యం పోలీసు వ్యవస్థకే గర్వకారణం.
ఈ అద్భుతమైన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత స్వయంగా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ సంభాషణలో జయశాంతి మాటలు ఎంతో వినయంగా, గర్వంగా ఉన్నాయి. తన భర్త కూడా ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ అని, తమది పోలీసుల కుటుంబమని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు.
మంత్రి అనిత మాటల్లో.. “జయశాంతి లాంటి పోలీసులు ఉన్నందుకే నేడు పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. మీ సేవలు వెలకట్టలేనివి” అంటూ మంత్రి అనిత ఆమెను ప్రశంసించారు. అంతేకాకుండా, జయశాంతి తనను కలవాలని కోరగా, వెంటనే సానుకూలంగా స్పందిస్తూ విజయవాడలో కలుద్దామని హామీ ఇచ్చారు.
యూనిఫామ్ లేకపోయినా, చంకలో చిన్న బిడ్డ ఉన్నా.. బాధ్యతను గుర్తెరిగి స్పందించిన జయశాంతి ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఒక తల్లిగా, ఒక రక్షక భటురాలిగా ఆమె చూపిన తెగువకు సెల్యూట్!




