Friday, January 23, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకొండపల్లి రైల్వే ట్రాక్ దగ్గర మురుగు సమస్యపై శివనాద్ ఆగ్రహం |

కొండపల్లి రైల్వే ట్రాక్ దగ్గర మురుగు సమస్యపై శివనాద్ ఆగ్రహం |

కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంబడి మురుగు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టండి..

దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసి విజ్ఞప్తి చేసిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్

ఉపగ్రహ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ వినతి..

విజయవాడ:
కొండపల్లి రైల్వే స్టేషన్ నుంచి విజయవాడలోని కృష్ణ మిల్క్ యూనియన్ వరకు రైల్వే ట్రాక్ వెంబడి మురుగునీరు, వర్షపు నీరు పేరుకుపోయే సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్ నిలయంలో గురువారం ఎంపీ కేశినేని శివనాథ్, బిజెపి మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి నూతలపాటి బాల కోటేశ్వరరావు , ఇతర నాయకులు అధికారులతో రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవను కలిసి వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కొండపల్లి–విజయవాడ మధ్య కీలకమైన రైల్వే కారిడార్ వెంబడి శాస్త్రీయ డ్రైనేజీ వ్యవస్థ, క్రాస్ డ్రైనేజీ నిర్మాణాలు, ఛానెల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వర్షాకాలంలోనే కాకుండా స్వల్ప వర్షపాతం సమయంలో కూడా నీరు నిలిచిపోతుందని తెలిపారు. దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో గట్టు కోతకు గురవడం, ట్రాక్ బలహీనపడటం, భద్రతా కారణాలతో రైళ్ల వేగం తగ్గించడం వల్ల కార్యాచరణ జాప్యాలు జరుగుతున్నాయని వివరించారు. అంతేకాకుండా ట్రాక్‌కు సమీపంలోని నివాసితులు, పరిశ్రమలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాయని పేర్కొన్నారు.

కొండపల్లి పారిశ్రామిక ప్రాంతం నుంచి సరుకు రవాణా అధికంగా ఉండటం, ఈ లైన్ వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, సమగ్ర నీటి నిర్వహణ వ్యవస్థను ప్రాధాన్యతపై చేపట్టాలని ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం విస్తరణపై సాంకేతిక అంచనా నిర్వహించి, డ్రైనేజీ ఛానెల్‌లు, కల్వర్టులు, లింక్డ్ అవుట్‌ఫ్లో వ్యవస్థలతో కూడిన నెట్‌వర్క్‌ను రూపొందించి అమలు చేయాలని కోరారు. అవసరమైతే స్థానిక మున్సిపల్, నీటిపారుదల శాఖలతో సమన్వయం చేసుకుని తగిన బడ్జెట్ కేటాయింపులు చేయాలని సూచించారు.

అలాగే విజయవాడ రైల్వే స్టేషన్‌పై పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రస్తావించారు. బల్బ్ లైన్ల సమీప ప్రాంతాల్లో విస్తారమైన ఓపెన్ ల్యాండ్ అందుబాటులో ఉండటం, ప్రధాన రహదారులు, ఎయిర్‌వేస్‌లకు అనుసంధానం ఉండటం, భవిష్యత్తులో అమరావతి కొత్త రైల్వే లైన్‌కు దగ్గరగా ఉండటం వంటి అంశాలను వివరించారు. ఈ ప్రాంతంలో హాల్ట్ లేదా ఉపగ్రహ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తే అమరావతి, ఔటర్ రింగ్ రోడ్ల వంటి మౌలిక సదుపాయాలకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని, అలాగే విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌పై ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని తెలిపారు.

ఈ ప్రతిపాదనలపై డీపీఆర్‌తో పాటు సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధం చేసి, సంబంధిత విభాగాలతో సంయుక్త తనిఖీ చేపట్టి, ప్రజా సౌలభ్యం, లాజిస్టిక్స్ రవాణాను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరగా జనరల్ మేనేజర్‌ సానుకూలంగా స్పందించారు.

కార్యక్రమంలో సి.ఎ.వో. ఆర్.ఎస్.పి సందీప్ కుమార్ జైన్, డి.జి.ఎమ్ ఉద‌యనాథ్ కోట్ల‌,
సెక్ర‌ట‌రీ జి.ఎమ్. మ‌ల్లాది శ్రీనివాస‌రావు, వ‌డ్ల‌మూడి జ‌గన్ మోహ‌న్ రావు, జాలిప‌ర్తి గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments