కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• కోటయ్యస్వామి పాదాభిషేక సేవలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
• శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూపానికి అష్టోత్తర అర్చనలు
• గురుబల ప్రాప్తి కలగాలంటూ ఆశీర్వదించిన అర్చక స్వాములు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండను సందర్శించారు. గురువారం మధ్యాహ్నం కోటప్పకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు విచ్చేసిన ఆయన త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, మధ్యాహ్న వేళ ప్రత్యేక పాదాభిషేక సేవలో పాల్గొన్నారు. అర్చక స్వాములు మేధా దక్షిణామూర్తి స్వరూపుడైన కోటయ్య స్వామికి పాదాభిషేకం చేసి, పుణ్య జలాన్ని శిరస్సుపై చల్లారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ఫల ప్రసాదం సమర్పించారు. పాదాభిషేకానంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కొటప్పకొండ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ రాజా మల్రాజు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
అంతకు ముందు ఆలయానికి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆలయ ముఖ్య అర్చకులు, దేవాదాయశాఖ ఆర్జేసీ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ కమిషనర్ శ్రీ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ శ్రీ చంద్రశేఖరరావు అధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయబద్దంగా తలపాగా చుట్టగా, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఉత్తరద్వారం నుంచి లోనికి ప్రవేశించారు.
శాస్త్రోక్తంగా పాదాభిషేకాదులు నిర్వహించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృత్తికా శుక్లా, మాజీ శాసన సభ్యులు శ్రీ కిలారు రోశయ్య, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంటేశ్వరరావు, నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ సయ్యద్ జిలానీ తదితరులు స్వామివారి పూజలో పాల్గొన్నారు.
హెలీప్యాడ్ వద్ద ఘనస్వాగతం
అంతకు ముందు కోటప్పకొండ పర్యటనకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్థానిక శాసన సభ్యులు డాక్టర్ అరవిందబాబుతో పాటు జిల్లా అధికారులు, అటవీశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుంచి కోటప్పకొండ ఆలయం వరకు, ఆలయం నుంచి నూతన రహదారి ప్రారంభోత్సవం వరకు పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు, కూటమి పక్షాల కార్యకర్తలు రోడ్డుకి ఇరువైపులా నిలబడి పూలు, హారతులతో స్వాగతం పలికారు. దారిపొడుగునా నిల్చున్న ప్రజలకు అభివాదం చేస్తూ, ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తూ, తక్షణం పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు.




