విజయవాడ వేదికగా చారిత్రక స్మృతులు
రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనానికి విజయవాడ ముస్తాబైంది
బిజెపి మూల సిద్ధాంత కర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన మానవతా దర్శన్ నేడు అమలు జరుగుతున్న నేపథ్యంలో ఆనాటి ఘట్టాన్ని గుర్తు చేసే విధంగా రేపటి నుండి విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రెండు రోజులు పాటు ఎనిమిది కాలాంశాలు పై దిశానిర్దేశం జరగనుంది.
ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సమ్మేళనం జరగనుంది.
60 సంవత్సరాల క్రితం ఏవిధంగా జరిగిందో నేడు అదేస్థాయిలో జరిగే తొలి రోజు కార్యక్రమానికి బిజెపి జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ జీ హాజరౌతారు అంటే ఎంత టి స్థాయిలో జరుగుతోందో అర్ధం అవుతుంది.
జనసంఘ్ 12వ మహాసభ పునఃస్మరణకు ‘కృష్ణదేవరాయ నగర’ ముస్తాబు
బెజవాడ నగరం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా మారుతోంది. సరిగ్గా ఆరు దశాబ్దాల క్రితం, 1965లో ఏ గడ్డపై అయితే భారతీయ జనసంఘ్ ప్రస్థానంలో కీలకమైన మలుపు చోటుచేసుకుందో, అదే నేల ఇప్పుడు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.
కొత్త ఆలోచనలకు ఊపిరి పోయడానికి సిద్ధమైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (నాటి వేదిక) వేదికగా భారతీయ జనసంఘ్ 12వ మహాసభ పునఃస్మరణ కార్యక్రమం శుక్రవారం (జనవరి 23) అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి ప్రముఖులు, పాత తరం బిజెపి కార్యకర్తలు తరలివస్తుండటంతో విజయవాడ నగరంలో పండుగ వాతావరణం నెలకొంది.
చరిత్ర పునరావృతం: ఏకాత్మ మానవ దర్శనానికి అంకురార్పణ.
భారత రాజకీయ చరిత్రలో 1965వ సంవత్సరానికి, విజయవాడ నగరానికి విడదీయరాని బంధం ఉంది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అత్యున్నత తాత్విక సిద్ధాంతం ‘ఏకాత్మ-మానవ దర్శనం’. ఈ సిద్ధాంతానికి సంబంధించి 1965లో ఇదే స్టేడియంలో జరిగిన జనసంఘ్ మహాసభల్లోనే విశేషమైన చర్చ జరిగి, చారిత్రక తీర్మానం ఆమోదించబడింది.
పాశ్చాత్య పెట్టుబడిదారీ విధానానికి, కమ్యూనిజానికి ప్రత్యామ్నాయంగా, భారతీయ మూలాల నుండి పుట్టిన ఈ సిద్ధాంతం నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. నాడు ఏ తేదీల్లో *(జనవరి 23, 24)* అయితే ఆ సభ జరిగిందో, నేడు అవే తేదీల్లో ఆ చారిత్రక ఘట్టాన్ని పునఃసమీక్షించుకోవడం ఈ కార్యక్రమ ప్రత్యేకత.
కృష్ణదేవరాయ నగర్‌గా స్టేడియం ముస్తాబు.
ఈ కార్యక్రమం జరుగుతున్న సమయం శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడైన రోజు కావడంతో, నిర్వాహకులు స్టేడియం ప్రాంగణానికి ‘కృష్ణదేవరాయ నగర్‌గా పేరుపెట్టారు. స్టేడియం లోపల, వెలుపల భారతీయ జనతా పార్టీ పతాకాలు, రంగురంగుల పూలు, విద్యుద్దీపకాంతులతో అలంకరించారు. సభా ప్రాంగణంలోకి దారితీసే ముఖద్వారాలకు భరతజాతి మహావీరుల పేర్లను పెట్టడం ద్వారా దేశభక్తిని చాటుతున్నారు.
సదస్సులు ` మేధోమధనం
రెండు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో కేవలం గతస్మృతులే కాకుండా, భవిష్యత్ దిశానిర్దేశం కూడా జరగనుంది.
ఏకాత్మ మానవతావాదం – నేటి ఆవశ్యకత: 1965 నాటి తీర్మానాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు, ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ సిద్ధాంతం ఎలా పరిష్కారం చూపుతుందనే దానిపై మేధోమధనం జరగనుంది.
రెండో సమావేశంలో ‘రాజకీయ ` సాంసకోణాలు’, మూడో సమావేశం ‘భారతీయత` ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రభావం అనే అంశంపై జరుగుతుంది.
‘వికేంద్రీకరణ – ఆర్థికాభివృద్ధి అంశంగా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వికేంద్రీకరణ ద్వారా సాధించిన సమగ్ర ఆర్థికాభివృద్ధిపై నాలుగో సమావేశంలోతైన చర్చలు ఉంటాయి.
అయిదో సమావేశం ఏకత్మా మానవ దర్శనం ద్వారా సుస్ధిర అభివద్ధి లక్ష్యాల సాధన, ముగింపు సమావేశం సమకాలీన అనువర్తనాలు` భవిష్య కార్యచరణ అనే అంశంపై జరగనుంది.
రాజకీయ చర్చలతో పాటు, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.
ప్రముఖుల రాక – తరలివచ్చిన జనసంఘ్ శ్రేణులు
ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయి నాయకత్వం హాజరవుతుండటం విశేషం. భాజపా జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు రామ్ మాధవ్, మురళీధర రావు తదితరులు పాల్గొంటున్నారు.
మరీ ముఖ్యంగా, 1965 నాటి జనసంఘ్ మహాసభలను ప్రత్యక్షంగా చూసిన, ఆనాడు పనిచేసిన అలనాటి కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా తరలివచ్చారు. వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా వారు సభకు హాజరవడం, వారి కోసం భాజపా శ్రేణులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం అందరినీ ఆకట్టుకుంటోంది.
విజయాల ప్రదర్శన .
దీన్ దయాళ్ ఉపాధ్యాయ నాడు చెప్పిన “త్రికరణ శుద్ధితో చేసే పనులతో విజయం సాధించడమే భారతీయ తత్వజ్ఞానం” అనే మాటలను ఆచరణలో పెట్టిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన విజయాలను కళ్లకు కట్టేలా ఒక ప్రత్యేక ‘ఎగ్జిబిషన’ను ఏర్పాటు చేశారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శన సందర్శకులకు స్ఫూర్తినిచ్చేలా రూపొందించబడింది.




