పర్యాటక ప్రాజెక్టుల కోసం ఏపీని అన్‌లాక్ చేశామన్న సీఎం చంద్రబాబు
ఆతిథ్య రంగంలో పెట్టుబడులపై తమారా లీజర్ సంస్థతో చర్చలు
విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు కాలిబో ఏఐ సంస్థకు పిలుపు
పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్టు వెల్లడి
గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం ఏర్పాటుకు తమారా సంస్థ ఆసక్తి
ఏపీలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఇందుకోసం రాష్ట్రాన్ని పూర్తిగా అన్‌లాక్ చేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలపై ప్రధానంగా దృష్టి సారించారు.
సదస్సులో భాగంగా తమారా లీజర్ సీఈఓ సృష్టి శిబులాల్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఆతిథ్య రంగంలో పెట్టుబడి అవకాశాలను ఆమెకు వివరించారు. పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించామని, పెట్టుబడిదారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో, అలాగే కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేయడానికి అపార అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. దీనిపై స్పందించిన తమారా ప్రతినిధులు, గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం పార్కులు, విశాఖ వంటి నగరాల్లో హోమ్ స్టే ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు.
మరోవైపు కాలిబో ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు రాజ్ వట్టికూటితోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఇప్పటికే అమరావతిలోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో తమ సంస్థ యువతకు ఏఐలో శిక్షణనిస్తోందని కాలిబో ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలకు కూడా విస్తరించాలని చంద్రబాబు సూచించారు. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ సెజ్‌లో ఒక “సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్” కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కాలిబో ఏఐ సంస్థను ఆయన ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్ కూడా పాల్గొన్నారు.




