గుంటూరు, జనవరి 24 : విద్యార్థులు సైబర్ నేరాల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) గౌరవనీయులు శ్రీమతి లత గారు అన్నారు.* గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సాయి కళ్యాణ్ చక్రవర్తి గారి ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు బ్రాడిపేటలోని మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఐదవ
అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) శ్రీమతి లత గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా *“అంతర్జాతీయ బాలిక దినోత్సవం”* ను పురస్కరించుకుని *“మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న సైబర్ నేరాలు”* అనే అంశంపై విద్యార్థులు, విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో గౌరవ న్యాయమూర్తి శ్రీమతి లత గారు మాట్లాడుతూ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల అధిక వినియోగం వల్ల విద్యార్థులు తెలియకుండానే సైబర్ నేరాలకు ఎలా గురవుతున్నారో ఉదాహరణలతో వివరించారు.
విద్యార్థినులు తమ కుటుంబానికి ఎంత ముఖ్యమో గుర్తించి బాధ్యతగా మెలగాలని సూచించారు. యుక్త వయస్సులో ఉండే ఆకర్షణలు, సామాజిక మాధ్యమాల ప్రభావం వలన వచ్చే ప్రమాదాలపై అవగాహన కలిగి, వీటికి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. సామాజిక మాధ్యమాలను అవసరానికి పరిమితంగా మాత్రమే ఉపయోగించాలని, మితిమీరిన వినియోగం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఎవరితోనూ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను షేర్ చేయకూడదని.
ఆన్లైన్లో తెలియని వ్యక్తులతో పరిచయాలు, చాటింగ్ చేయడం ప్రమాదకరమని తెలియజేశారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే లాభాలు ఉంటాయని, దుర్వినియోగం చేస్తే జీవితంపై తీవ్రమైన ప్రభావాలు పడతాయని స్పష్టం చేశారు. విద్యార్థి దశలో చదువులపై ఏకాగ్రత పెట్టి, ఉన్నత విద్య సాధించి, జీవితంలో మంచి స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, గురువులకు, తమ ప్రాంతానికి మరియు దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ధైర్యంగా ముందుకు సాగుతూ
సురక్షిత వాతావరణంలో ఉండి తమను తాము రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజీ డైరెక్టర్ శ్రీ మట్టుపల్లి మోహన్ గారు మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దానిని సాధించేందుకు నిరంతర కృషి చేయాలని సూచించారు. నేటి కాలంలో సెల్ఫోన్ వినియోగం అధికంగా పెరిగిందని, సెల్ఫోన్లకు దూరంగా ఉన్నప్పుడే విద్యార్థులు తమ లక్ష్యాలపై పూర్తి దృష్టి సారించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ శ్రీ మట్టుపల్లి మోహన్ గారు, అరండల్పేట ఎస్.ఐ. శ్రీ ఏడుకొండలు గారు, కోర్టు సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
