ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యం… జిల్లా అంతటా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు
జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా..
. అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాలు మరియు మండల కేంద్రాలలో అర్ధరాత్రి వరకు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు సమన్వయంతో పాల్గొని ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనదారులను తనిఖీ చేశారు. బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు.
మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. దీనివల్ల వాహనదారుడితో పాటు సాటి ప్రయాణీకుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.
అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో…ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఇటువంటి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. రోడ్డు భద్రతలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేపట్టాలని… పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.




