మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి
తెలుగుదేశం పార్టీ బలం, బలగం కార్యకర్తలు
దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ సీబీఎన్
అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయంటే కారణం చంద్రబాబు గారు
కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లు టీం 11
ఒక్క పెన్షన్ లకే ఏడాదికి రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది
గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో వరకు ఎదగాలి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో మంత్రి లోకేష్
*టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి శిక్షణ తరగతులను ప్రారంభించిన మంత్రి
మంగళగిరి: మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి. తెలుగుదేశం పార్టీ బలం, బలగం కార్యకర్తలు. పార్టీ అంటే కమిట్ మెంట్ ఉంది కాబట్టే పార్టీ కమిటీల్లో బాధ్యత కల్పించాం. దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ సీబీఎన్. అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయంటే కారణం చంద్రబాబు గారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ శిక్షణా తరగతులకు ఇటీవల నియమించిన 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు. పార్టీ అంటే కమిట్ మెంట్ ఉన్నవారు కనుకనే ఈ రోజు పార్టీ కమిటీల్లో బాధ్యత కల్పించడం జరిగింది. పార్లమెంట్ కమిటీల్లో మొదటిసారి ఎన్నికైన వారు 83శాతం మంది ఉన్నారు. సీనియర్లను, జూనియర్లను నేను సమానంగా గౌరవిస్తాను, పనిచేసే వారిని ప్రోత్సహిస్తాను. దానికి మీరో ఉదాహరణ.
*తెలుగుదేశం పార్టీ బలం, బలగం కార్యకర్తలు*
దేశంలో అనేక ప్రాంతీయ పార్టీల ఉన్నాయి. ప్రాంతీయ పార్టీ ఒకసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో మనం చూశాం. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో కానీ.. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక్క తెలుగుదేశానికే సొంతం. మన బలం, బలగం మన కార్యకర్తలు. ఆనాడు పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు వెళితే పత్రాలు లాక్కున్నారు. అప్పుడు మీసాలు మెలేసి, తొడగొట్టిన అంజిరెడ్డి తాత నాకు స్ఫూర్తి. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడి రక్తమోడుతున్నా చివరి ఓటు పడే వరకు పోలింగ్ బూత్ లో తెగువ చూపిన మంజుల గారే నాకు స్ఫూర్తి. విజయవాడలో వైసీపీ గూండాల దాడిలో కంటిచూపు కోల్పోయినా జై తెలుగుదేశం అని నినదించిన చెన్నుపాటి గాంధీ నాకు స్ఫూర్తి. మెడపై కత్తిపెట్టి తమ నాయకుడి పేరు చెప్పమంటే.. జై చంద్రబాబు, జై టీడీపీ అని నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి.
*దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ సీబీఎన్*
మడమ తిప్పడం, మాట మార్చడం మన బ్లడ్ లోనే లేదు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీ. 1983 నుంచి మనం అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. స్వర్గీయ ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిగా ముందుకు నడిపిస్తున్నారు మన నాయకుడు చంద్రబాబునాయుడు గారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ సీబీఎన్. ఆయన ఎప్పుడూ ఓ ట్రెండ్ సెట్టర్. 75 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా పనిచేస్తున్నారు. ఆయనలో ముగ్గురు 25 ఏళ్ల యువకులు ఉన్నారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేయాలని నిత్యం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు గారు.
*కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లు టీం 11*
చంద్రబాబు గారు ముందుచూపుతో మనల్ని నడిపిస్తున్నారు. 1995లో ఐటీ తీసుకువచ్చినప్పుడు ఆనాటి పాలకులు ఎగతాళి చేశారు. కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. ఈ రోజు సైబరాబాద్ చూస్తే అర్థమవుతుంది. మీ కుటుంబాల్లోనే కనీసం 50శాతం మంది ఆ ఐటీ వల్లే బాగుపడ్డారు. ఈ రోజు అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయంటే కారణం చంద్రబాబునాయుడు గారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. మన నాయకుడు సంక్షేమం, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే.. టీం 11 కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లు.
*ఒక్క పెన్షన్ లకే ఏడాదికి రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం*
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటున్నాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా రూ.4వేల వృద్ధాప్య పెన్షన్ చెల్లిస్తున్నాం. వికలాంగులకు రూ.6వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు చెల్లిస్తున్నాం. ఒక్క పెన్షన్ లకే ఏడాదికి రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు అండగా నిలిచాం. యువగళం కింద రూ.20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషిచేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ 200 కేసులు వేసినా కూటమి ప్రభుత్వంలో 150 రోజుల్లోనే డీఎస్సీ పూర్తిచేసి 16వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. 6వేల మందిని పోలీస్ కానిస్టేబుల్స్ గా నియమించాం. పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకువస్తున్నాం. దేశంలో 25 శాతం పెట్టుబడులు ఒక్క ఏపీకే వస్తున్నాయి. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.2వేల కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలుచేస్తాం.
*చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది*
చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అసలు ఏపీలో పెన్షన్ ను మొదట అమలుచేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు రూ.30తో పెన్షన్ ప్రారంభించారు. ఆ పెన్షన్ 2014లో రూ.200. చాలీచాలని రూ.200 పెన్షన్ ను మన ప్రభుత్వం వెయ్యికి పెంచింది. 2019 ఎన్నికల ముందు హామీ ఇవ్వకపోయినా రూ.వెయ్యి పెన్షన్ ను రూ.2వేలకి పెంచాం. గత ప్రభుత్వం పెన్షన్ వెయ్యి పెంచడానికి ఐదేళ్లు తీసుకుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి పెన్షన్ పెంచి రూ.4వేలు చేశాం. ఇవన్నీ ప్రజలకు వివరించాలి. మనం పనులు చేయడం ఎంత ముఖ్యమో.. చేసిన పనులు చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యం.
*గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో వరకు ఎదగాలి*
మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని నేను కోరుకుంటున్నాను. పార్టీలో సంస్కరణల కోసం కృషిచేస్తున్నా. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని ప్రతిపాదించాను. అది నాకు కూడా వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఒకే పదవిలో రెండుసార్లు కంటే ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ కావాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పొలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను మాట్లాడటం జరిగింది. ఇది మన పార్టీ, మన కుటుంబం. జిల్లా పార్టీ కమిటీల స్థానంలో పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకువచ్చేందుకు నాకు 18 నెలల సమయం పట్టింది. పొలిట్ బ్యూరోలో పోరాడాను. నమ్మిన సిద్ధాంతాల కోసం మనం వందసార్లయినా పోరాడాలి.
*రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉంది*
గత మహానాడులో మనం ఆరు శాసనాలను తీర్మానించుకున్నాం. అందులో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత. కార్యకర్తలను అందరూ గౌరవించాలి. ఆప్యాయంగా పలకరించాలి. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. రెండోది యువగళం. యువత రాజకీయాల్లోకి రావాలి. అన్ని కమిటీల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ ఎంతోమంది యువకులు, బాగా చదువుకున్న వారికి అవకాశం ఇచ్చి గెలిపించారు. వారు కూడా పార్టీకి అనేక సేవలు అందించారు. యువతను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉంది. మూడో శాసనం.. పేదల సేవలో- సామాజిక న్యాయం. ఈ రోజు మనం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పేదరికం లేని సమాజం కోసమే. తల్లికి వందనం, పెన్షన్, స్త్రీ శక్తి, దీపం పథకం, పీ-4 కార్యక్రమం.. ఇవన్నీ పేదరికం లేని సమాజం కోసమే చేస్తున్నాం. అన్ని పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. నాలుగోది స్త్రీ శక్తి. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలని తొలి అడుగు వేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. పార్టీ పదవుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలి. మహిళలను కించపరిచే పదాలను విడనాడాలి. పార్టీలో మహిళలను గౌరవించాలి. ఐదోది అన్నదాతకు అండగా. వారికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గతేడాది పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయడం జరిగింది. సప్లై-డిమాండ్ కు అనుగుణంగా ఏయే పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించడం జరుగుతోంది. దీంతో ఎప్పుడూ లేనివిధంగా మిరప ధర రికార్డు స్థాయిలో ఉంది. అన్నదాతకు కష్టం వస్తే మనం అండగా నిలవాలి. ఆరోది తెలుగుజాతి విశ్వఖ్యాతి. తెలుగుజాతి కోసం పుట్టిన పార్టీ టీడీపీ. ప్రపంచంలో ఏ రంగం చూసినా తెలుగువారు నెం.1గా ఉండే విధంగా మనం కృషిచేయాలి. అదే మన లక్ష్యం. పార్టీలో నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ ఆరు శాసనాలు పాటించాలి.
*పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు లాంటిది*
పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు లాంటిది. పార్టీ కార్యాలయానికి సమయం కేటాయించాలి. చంద్రబాబు గారికి ఎంత పని ఒత్తిడి ఉన్నా వారానికోసారి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. కార్యకర్తలను కలుస్తున్నారు. శిక్షణ తరగతుల కార్యక్రమాలకు కూడా చంద్రబాబు గారు హాజరవుతున్నారు. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నా.. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవనన్న కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం పనులు పరిగెడుతున్నాయి. విశాఖకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. రైల్వేజోన్ ఏర్పాటుచేసుకున్నాం. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకువస్తాం. కేంద్ర సహకారం లేకపోతే మనం అనుకున్న కార్యక్రమాలు చేయలేం. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి.
*అభివృద్ధికి ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం*
పార్టీ నేతలు అలక వీడాలి. ప్రతిపక్షంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మన నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. అలక వల్ల మనం నష్టపోతాం. ఏదైనా ఉంటే పార్టీలో పోరాడాలి. ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. కనీసం 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి, కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పవనన్న చెప్పారు. కూటమి అంటే మూడు పార్టీల కలయిక. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటి పరిష్కారం కోసం కృషిచేయాలి. మనకు విడాకులు లేవు, క్రాస్ ఫైర్స్ లేవు, కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. మనం అప్రమత్తంగా ఉండాలి. మన మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి.
*పదవిని బాధ్యతగా స్వీకరించాలి*
వ్యక్తులు శాశ్వతం కాదు.. తెలుగుదేశం పార్టీ శాశ్వతం. ఒక వ్యవస్థ కింద మనం అందరం నడుచుకోవాలి. పార్టీ వ్యవస్థను బలోపేతం చేసేందుకే మేం ఉన్నాం. అందరికీ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోంది. ఇది నిరంతర ప్రక్రియ. చాలా మంది మొదటిసారి పార్లమెంట్ కమిటీలకు ఎన్నికయ్యారు. వారికి శిక్షణ చాలా ముఖ్యం. పార్టీ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నా. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పనిచేసే వారిని గుర్తిస్తున్నాం. మై టీడీపీ యాప్ ను అందరూ వినియోగించాలి. మై టీడీపీ యాప్ ద్వారానే పార్టీ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలుచేయాలి. పదవిని బాధ్యతగా స్వీకరించాలని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళదామని మంత్రి అన్నారు. ఈ వర్క్ షాప్ ను కలిసికట్టుగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి లోకేష్ నిత్య విద్యార్థిలా మారి శిక్షణ తరగతులకు హాజరయ్యారు. శిక్షణ తరగతుల్లో వెనుక కూర్చొని పాఠాలు విన్నారు. వర్క్ షాప్ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు.
*స్వయంగా ఆహ్వానం పలికిన మంత్రి లోకేష్*
అంతకుముందు వర్క్ షాప్ లో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన పార్లమెంటరీ పార్టీ కమిటీ సభ్యులకు మంత్రి లోకేష్ స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగారు. మరోవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుక నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులు మంత్రి నారా లోకేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు, జోనల్ కోఆర్డినేటర్లు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.




