మంత్రి నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్ ఛేంజర్‌గా నిలిచిందన్న నేతలు
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా ప్రజా చైతన్యమే లక్ష్యంగా యువగళం సాగిందన్న నేతలు
నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌కు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్‌తో కేక్ కట్ చేయించి సంబరాలు జరిపారు. ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని నేతలు కొనియాడారు.
రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా ప్రజా చైతన్యమే లక్ష్యంగా యువగళం సాగిందని నేతలు గుర్తు చేసుకున్నారు. 2023 జనవరి 27న కుప్పంలో శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత ప్రారంభమైన యువగళం పాదయాత్ర, 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మున్సిపాలిటీలు,మండలాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర కొనసాగింది. లోకేశ్ పాదయాత్ర జరిగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఈ యాత్ర ప్రభావానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, సోమిరెడ్డి, యార్లగడ్డ వెంకట్రావు, ఉగ్ర నరసింహారెడ్డి, గణబాబు, ఆదిరెడ్డి వాసు, ఎంఎస్ రాజు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి, వేపాడ, గ్రీష్మ, కార్పొరేషన్ ఛైర్మన్లు తదితరులు లోకేశ్‌కు అభినందనలు తెలిపారు.




