Home South Zone Andhra Pradesh Guntur: పుత్రశోకంలోనూ ఓ తల్లి గొప్ప నిర్ణయం.. ఆరుగురికి కొత్త జీవితం!

Guntur: పుత్రశోకంలోనూ ఓ తల్లి గొప్ప నిర్ణయం.. ఆరుగురికి కొత్త జీవితం!

0
0

రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన అమర్‌ బాబు బ్రెయిన్ డెడ్
అవయవదానానికి అంగీకరించిన తల్లి కోటేశ్వరి
గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతికి గుండె తరలింపు
తల్లి నిర్ణయాన్ని అభినందించిన ఎమ్మెల్యే గల్లా మాధవి
తీరని పుత్రశోకంలోనూ ఓ తల్లి గొప్ప మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన తన కుమారుడి అవయవాలను దానం చేసి, ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడుకు చెందిన పెరుగు అమర్‌ బాబు ఈ నెల 24న తాడికొండ మండలం నిడుముక్కలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే గుంటూరులోని ఆస్టర్‌ రమేశ్ ఆసుప‌త్రికి తరలించారు. అక్క‌డ‌ చికిత్స పొందుతున్న స‌మ‌యంలో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో జీవన్‌దాన్‌ కో ఆర్డినేటర్లు అమర్ తల్లి కోటేశ్వరికి అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. కన్నీటి పర్యంతమైనప్పటికీ ఆమె తన కొడుకు అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు.

సోమవారం వైద్యులు అవయవాల సేకరణ ప్రక్రియను చేపట్టారు. అమర్ గుండెను తిరుపతి పద్మావతి ఆసుప‌త్రికి తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించారు. కాలేయం, ఒక కిడ్నీని గుంటూరు రమేశ్ ఆసుప‌త్రికి, మరో కిడ్నీని ఎన్‌ఆర్‌ఐ ఆసుప‌త్రికి, రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి అందించారు. ఈ అవయవదానం ద్వారా మొత్తం ఆరుగురు కొత్త జీవితాన్ని పొందారు.

అమర్‌ పుట్టిన ఏడాదికే తన భర్త చనిపోగా, ఇప్పుడు కొడుకు కూడా దూరం కావడంతో తల్లి కోటేశ్వరి వేదన వర్ణనాతీతం. అయినప్పటికీ తన కొడుకు మరో ఆరుగురి రూపంలో జీవించే ఉంటాడని ఆమె చెప్పడం పలువురిని కదిలించింది. విషయం తెలుసుకున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆసుప‌త్రికి వెళ్లి అమర్ తల్లిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంతటి దుఃఖంలోనూ మానవతా దృక్పథంతో గొప్ప నిర్ణయం తీసుకున్న వారిని ఆమె అభినందించారు.

NO COMMENTS