Thursday, January 29, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshటీడీపీ వర్క్‌షాప్‌... కార్యకర్తల మధ్యలో కూర్చున్న చంద్రబాబు.

టీడీపీ వర్క్‌షాప్‌… కార్యకర్తల మధ్యలో కూర్చున్న చంద్రబాబు.

టీడీపీ పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
నాయకులతో కలిసి కూర్చుని శిక్షణ పొందిన అధినేత
కార్యకర్తే పార్టీకి అధినేత అని మరోసారి చాటిచెప్పిన వైనం
పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ పథకాలపై 1050 మందికి శిక్షణ

చంద్రబాబు నిరాడంబరత స్ఫూర్తిదాయకమన్న నేతలు, కార్యకర్తలు
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా, తెలుగుదేశం పార్టీలో మాత్రం తాను ఒక సామాన్య కార్యకర్తనే అని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి చాటిచెప్పారు. అధికారిక హోదాలు, ప్రోటోకాల్ పక్కనపెట్టి, పార్టీ ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో ఆయన కార్యకర్తల మధ్యలో కూర్చుని నాయకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పార్లమెంట్ కమిటీల వర్క్‌షాప్‌లో ఆయన నిరాడంబరత అందరినీ ఆశ్చర్యపరిచింది, స్ఫూర్తినింపింది.

మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో 25 పార్లమెంట్ కమిటీల కోసం తెలుగుదేశం పార్టీ ఒక రోజు వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఒక్కో కమిటీ నుంచి 42 మంది చొప్పున మొత్తం 1,050 మంది సభ్యులు ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వర్క్‌షాప్ జరుగుతున్న వివిధ గదుల్లోకి స్వయంగా వెళ్లిన చంద్రబాబు, అక్కడి నాయకులు, కార్యకర్తల మధ్యలో కూర్చుని వారితో మమేకం అయ్యారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నూతన పార్లమెంట్ అధ్యక్షులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతిలోనూ ఆయన సాధారణ సభ్యుడిలా హాజరై, నేతలు చెప్పే విషయాలను శ్రద్ధగా విన్నారు.

పార్టీ అధినేత, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమతో పాటు కూర్చోవడంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు మొదట ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన చూపిన చొరవ, నిబద్ధత తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని వారు అభిప్రాయపడ్డారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ‘కార్యకర్తే అధినేత’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతామని, దానికి అనుగుణంగానే తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, నాలుగున్నర దశాబ్దాల ప్రయాణం, క్యాడర్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై ఆయన నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ వర్క్‌షాప్‌లో కూటమి ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలు, విజన్ ప్లాన్‌లపై కూడా సభ్యులకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉన్న నారా లోకేశ్ కూడా ప్రతి బృందం సభ్యులతోనూ ముచ్చటించారు. చంద్రబాబు తన హోదాను పక్కనపెట్టి సామాన్య కార్యకర్తగా ఒదిగిపోయిన విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ ఘటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments