Wednesday, January 28, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshనారా లోకేశ్: పార్టీలో మార్పులు అవసరం |

నారా లోకేశ్: పార్టీలో మార్పులు అవసరం |

Nara Lokesh TDP Needs Changes Adapting to Times

టీడీపీ బలం, బలగం కార్యకర్తలేనన్న నారా లోకేశ్
గ్రామ స్థాయి కార్యకర్త పొలిట్‌బ్యూరో వరకు ఎదగాలని ఆకాంక్ష
పార్టీ పదవులకు టర్మ్ లిమిట్ ఉండాలని ప్రతిపాదన
పెన్షన్లకే ఏటా రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న మంత్రి
మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు రావాలని, గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షుడు పొలిట్‌బ్యూరో స్థాయి వరకు ఎదిగేలా సంస్కరణలు చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలం, బలగం అని, వారి త్యాగాల పునాదులపైనే తెలుగుదేశం పార్టీ నిలబడి ఉందని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నూతనంగా నియమితులైన 25 పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీల కోసం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

తెలుగుదేశం పార్టీ బలం, బలగం కార్యకర్తలు
దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలమైన కార్యకర్తల వ్యవస్థ ఒక్క తెలుగుదేశానికే సొంతమని లోకేశ్ అన్నారు. “స్వర్గీయ ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో కానీ, మన బలం, బలగం మన కార్యకర్తలే. పుంగనూరులో నామినేషన్ పత్రాలు లాక్కున్నప్పుడు మీసాలు మెలేసిన అంజిరెడ్డి తాత, మాచర్లలో రక్తమోడుతున్నా పోలింగ్ బూత్‌లో నిలబడిన మంజుల, విజయవాడలో కంటిచూపు కోల్పోయినా జై టీడీపీ అన్న చెన్నుపాటి గాంధీ, మెడపై కత్తిపెట్టినా జై చంద్రబాబు అని ప్రాణాలు విడిచిన తోట చంద్రయ్య వంటి కార్యకర్తలే నాకు స్ఫూర్తి” అని ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.

దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ సీబీఎన్
దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిందే టీడీపీ అని లోకేశ్ గుర్తుచేశారు. “1983లోనే రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు వంటివి ఎన్టీఆర్ తెచ్చారు. ఆయన స్ఫూర్తితో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఆయనే. 75 ఏళ్ల వయసులో కూడా ఆయనలో ముగ్గురు 25 ఏళ్ల యువకులు ఉన్నారు. నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారు” అని కొనియాడారు.

కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లు టీం 11
చంద్రబాబు ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని లోకేశ్ తెలిపారు. 1995లో ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారని, కానీ నేడు సైబరాబాద్ వల్లే లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయని అన్నారు. “మన నాయకుడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే, కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి ‘టీం 11’ బ్రాండ్ అంబాసిడర్లు” అంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ వంటి సంస్థలు ఏపీకి రావడానికి చంద్రబాబుపై ఉన్న నమ్మకమే కారణమన్నారు.

ఒక్క పెన్షన్ లకే ఏడాదికి రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని లోకేశ్ తెలిపారు. “దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకు రూ.6 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు అందిస్తున్నాం. ఒక్క పెన్షన్లకే ఏడాదికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, 150 రోజుల్లో 16 వేల డీఎస్సీ పోస్టుల భర్తీ వంటివి పూర్తిచేశాం” అని వివరించారు.

చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని లోకేశ్ సూచించారు. “మనం పనులు చేయడం ఎంత ముఖ్యమో, చేసిన పనులను చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యం. పెన్షన్ చరిత్రను ప్రజలకు వివరించాలి. రూ.200 ఉన్న పెన్షన్‌ను మనమే రూ.2 వేలు చేసి, ఇప్పుడు రూ.4 వేలకు పెంచామని స్పష్టంగా చెప్పాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో వరకు ఎదగాలి
పార్టీలో అంతర్గత సంస్కరణల ఆవశ్యకతను లోకేశ్ నొక్కిచెప్పారు. “పార్టీలో ప్రతి పదవికి టర్మ్ లిమిట్ ఉండాలి. ఒకే వ్యక్తి ఒక పదవిలో రెండుసార్లు కంటే ఎక్కువ ఉండకూడదు. వారు ప్రమోట్ కావాలి. ఒక సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్‌బ్యూరో వరకు ఎందుకు రాకూడదు? దీనికోసం పొలిట్‌బ్యూరోలో పోరాడాను” అని తెలిపారు.

రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉంది
మహానాడులో తీర్మానించిన ‘ఆరు శాసనాలను’ పార్టీ నాయకులు తప్పనిసరిగా పాటించాలని లోకేశ్ ఆదేశించారు. కార్యకర్తలకే పెద్దపీట వేయాలని, యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించాలని, సామాజిక న్యాయం పాటించాలని, మహిళలను గౌరవించాలని సూచించారు. అన్నదాతకు అండగా నిలుస్తూ, తెలుగుజాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments