Home South Zone Andhra Pradesh మంచినీటి పనులను అడ్డుకున్న వెల్లంపల్లి మైలవరం రత్నకుమారి ఆగ్రహం

మంచినీటి పనులను అడ్డుకున్న వెల్లంపల్లి మైలవరం రత్నకుమారి ఆగ్రహం

0
0

44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి ఆగ్రహం*
విజయవాడ పశ్చిమ, జనవరి 28: స్థానిక 44వ డివిజన్ విద్యాధరపురం చెరువు సెంటర్ కొండపై ఉన్న మంచినీటి రిజర్వాయర్ మరమ్మతు పనులను రాజకీయ కక్షతోనే మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అడ్డుకున్నారని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ అడుగుభాగం పూర్తిగా దెబ్బతిన్నదని , అలాగే రిజర్వాయర్ పై స్లాబ్ పెచ్చులూడి ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయని, పైనుండి స్లాబు ముక్కలు ముక్కలుగా పెచ్చులూడి పడిపోతోందని, ఈ రిజర్వాయర్ ను మరమ్మత్తులు చేయించాలని గత రెండేళ్ల నుంచి తాము కౌన్సిల్లో కోరుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా తమ ప్రతిపాదనలను పక్కన

పెట్టేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చెరువు సెంటర్ కొండపై దెబ్బతిన్న స్థితిలో ఉన్న రిజర్వాయర్ ను కూటమి కార్పొరేటర్లు, నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రత్నకుమారి మాట్లాడుతూ రిజర్వాయర్ మరమత్తులపై 34.12 లక్షల రూపాయలు మేరకు అధికారులు అంచనా వేశారని, దీన్ని స్టాండింగ్ కమిటీ తిరస్కరిస్తూ పలుమార్లు వాయిదాలు వేయడం దారుణమని విమర్శించారు. మంచినీరు కలుషితమైన రావడంతో డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత మంచినీటి వలన ప్రజలకు

ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే దానికి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ , అలాగే స్టాండింగ్ కమిటీ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి కార్పొరేటర్ల ప్రతిపాదనలను వాయిదాలు వేస్తున్న వైసీపీ పాలక పక్షం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతోందని, ఇది మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కి, వైసిపి పాలక పక్షానికి సరికాదని అన్నారు. తెలుగుదేశం నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ తీసుకోవాల్సిన

నిర్ణయాలను మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తన ఇంట్లో కూర్చుని తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. తనను పార్టీ మారాడని విమర్శించే నైతిక అర్హత మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు లేదని అన్నారు. ఆయన 2014 లో కాంగ్రెస్ టికెట్ తీసుకుని ఆ మరుసటి రోజు బిజెపి టికెట్ పొంది ఎమ్మెల్యేగా పోటీ చేశారని, ఆయన కంటే పెద్ద ఫిరాయింపుదారుడు

ఎవరు ఉండరని ఎద్దేవా చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటి రిజర్వాయర్ మరమ్మత్తు పనులకు వెంటనే స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర, అత్తులూరి ఆదిలక్ష్మి, మహదేవు అప్పాజీ రావు, అబ్దుల్ హర్షద్, కూటమి నాయకులు మైలవరపు కృష్ణ, అత్తులూరి పెద్దబాబు, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, రెడ్డిపల్లి రాజు, సంభాన బాబురావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

NO COMMENTS