Home South Zone Andhra Pradesh సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్.

సమిష్టి కృషితో రథసప్తమి విజయవంతం: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్.

0

TTD to Construct Multi Level Car Parking in Tirumala After Ratha Saptami Rush
సమిష్టి కృషితో రథసప్తమి వేడుకలు విజయవంతం
రికార్డు స్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు హాజరు
గ్యాలరీల్లో లక్షలాది మందికి అన్నప్రసాదాలు, పానీయాల పంపిణీ
ఏర్పాట్లపై 97% భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడి

వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవలు
తిరుమలలో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడి

తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా, అత్యంత విజయవంతంగా ముగిశాయి. ఒకేరోజు బ్రహ్మోత్సవంగా భావించే ఈ ఉత్సవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలను వీక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, టీటీడీ బోర్డు సూచనలతో జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ఆర్టీసీ, శ్రీవారి సేవకుల సమిష్టి కృషితో ఈ వేడుకలను దిగ్విజయంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

రథసప్తమి వేడుకలు ముగిసిన అనంతరం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీ కల్పిస్తున్న మెరుగైన సౌకర్యాల వల్ల తిరుమలకు భక్తుల తాకిడి గణనీయంగా పెరిగిందన్నారు. గత అనుభవాలను, భక్తుల నుంచి స్వీకరించిన సూచనలను పరిగణనలోకి తీసుకుని సేవలను మరింత మెరుగుపరిచామని వివరించారు. రథసప్తమి నాడు అహోరాత్రులు శ్రమించిన అర్చకులు, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, రథసప్తమి ఏర్పాట్లపై వాట్సాప్, ఐవీఆర్ఎస్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించగా, దాదాపు 97% మంది పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. మాడ వీధుల్లో ఒక్క భక్తుడు కూడా సౌకర్యాలపై ఫిర్యాదు చేయకపోవడమే టీటీడీ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్యాలరీలలో అదనపు మరుగుదొడ్లు, స్క్రీన్లు ఏర్పాటు చేయాలని కొందరు భక్తులు సూచించారని, వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో త్వరలోనే మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని, రాంభగీచా ప్రాంతంలో భక్తుల తోపులాటలు జరగకుండా భవిష్యత్తులో పటిష్ఠ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

రికార్డు స్థాయిలో సేవలు.. ముఖ్యాంశాలు

రథసప్తమి సందర్భంగా గ్యాలరీల్లోని భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేశారు. సుమారు 9.42 లక్షల మందికి అన్నప్రసాదాలు, 6.30 లక్షల మందికి పానీయాలు, 2.90 లక్షల మందికి పాలు అందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1800 మంది పోలీసులు, 1414 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

భక్తుల రవాణా కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందించింది. తిరుపతి-తిరుమల మధ్య 1,932 ట్రిప్పుల ద్వారా 60,425 మందిని, తిరుమల-తిరుపతి మధ్య 1,942 ట్రిప్పుల ద్వారా 82,241 మంది భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన అద్భుతమైన విద్యుత్, పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమారు 1000 మంది కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, లగేజీ కేంద్రాల ద్వారా కూడా భక్తులకు మెరుగైన సేవలు అందించారు. రథసప్తమి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు ఎస్వీబీసీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ వేడుకల విజయానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖలకు, సిబ్బందికి, మీడియాకు టీటీడీ ధన్యవాదాలు తెలియజేసింది.

NO COMMENTS

Exit mobile version