హైదరాబాద్ : (భారత్ ఆవాజ్ ప్రతినిధి)
నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి IPS స్పష్టం చేశారు. అంబర్ పేట లోని డిసిపి కార్యాలయ ఆవరణలో సికింద్రాబాద్ జోన్ పరిధిలోని యాక్టివ్ మరియు ఇన్ యాక్టివ్ ఆ రౌడీషీటర్లకు ఆమె కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. సమాజంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించినా, సెటిల్మెంట్లు, భూతగాదాలు, లేదా ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా ఉక్కు పాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. నేరపూరిత జీవితాన్ని వదిలిపెట్టి బాధ్యతాయుతమైన పౌరులుగా మారి కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా జీవించాలని సూచించారు.
పోలీస్ నిఘాలో రౌడీ షీటర్లు :
పదేపదే నేరాలకు పాల్పడే వారిపై కేవలం కేసులు మాత్రమే కాకుండా, అవసరమైతే పీడీ (PD) యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డిసిపి తెలిపారు. రౌడీ షీటర్ల కదలికపై నిరంతర నిఘా ఉంటుందని, చట్టాన్ని అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ పరిధిలోని ఏసీపీలు, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ ఓ లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
#sidhumaroju




