Thursday, January 29, 2026
spot_img
HomeSouth ZoneAndhra PradeshJagan Mohan Reddy: చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్.

Jagan Mohan Reddy: చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్.

Jagan Mohan Reddy Slams Chandrababu Naidu Government

రెండేళ్ల చంద్రబాబు పాలన ‘జంగల్ రాజ్’లా ఉందని జగన్ విమర్శ
మద్యం, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణ
టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నా చర్యలు శూన్యమని వ్యాఖ్య
సంక్రాంతి పండుగను జూదం, అశ్లీల నృత్యాలతో భ్రష్టు పట్టించారని విమర్శ
మరో ఏడాదిన్నరలో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వాన్ని ఎండగడతానన్న జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భీమవరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ‘జంగల్ రాజ్’ నడుస్తోందని, ‘దోచుకో, పంచుకో, తినుకో’ అనే రీతిలో పాలన సాగుతోందని ఘాటుగా విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ అబద్ధాలేనని తేలిపోయిందని అన్నారు.

“చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్లలో రైతులు, మహిళలు, యువత సహా ఏ ఒక్క వర్గానికైనా మంచి జరిగిందా? మా ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి హామీని నెరవేర్చిన పాలన మాది. కానీ ఇప్పుడు హామీలను మోసపూరితంగా గాలికొదిలేశారు. ఎన్నికలప్పుడు బాండ్లు పంచిపెట్టి ప్రజలను దగా చేశారు. ఇలాంటి మోసాలు చేసే వారిపై 420 కేసులు పెడతారు. కానీ చంద్రబాబు, ఆయన కూటమి నేతలు మాత్రం బయట తిరుగుతున్నారు,” అని జగన్ విమర్శించారు.

రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి రాజ్యమేలుతోందని జగన్ ఆరోపించారు. “మద్యం వ్యాపారం మొత్తం మాఫియా చేతుల్లోకి వెళ్లింది. ప్రైవేట్ షాపులన్నీ వాళ్ల మనుషులకే ఇచ్చారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను వేలం పెట్టి మరీ అమ్ముకుంటున్నారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతూ, పర్మిట్ రూమ్‌లు నడుపుతూ, కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల రక్తం తాగుతున్నారు. ఇసుక మా హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు ఆదాయం తెచ్చిపెడితే, ఇప్పుడు ఫ్రీ అని చెప్పి అక్రమంగా తవ్వేస్తూ రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు,” అని జగన్ ఆరోపించారు.

సంక్రాంతి పండుగను జూదం, అశ్లీల నృత్యాలతో భ్రష్టు పట్టించారని, ఇది జంగల్ రాజ్ కాకపోతే మరేమిటని ఆయన ప్రశ్నించారు. “రోడ్లపై రికార్డింగ్ డ్యాన్సులు, మొబైల్ వ్యాన్లలో మద్యం అమ్మకాలు జరిపారు. ఈ అరాచకాల కోసం నియోజకవర్గాల్లో వేలం పాటలు నిర్వహించారు. ‘ఊపేయ్, కుదిపేయ్’ అంటూ యూనిఫామ్‌లో ఉన్న డీఎస్పీనే ప్రోత్సహించడం సిగ్గుచేటు,” అని మండిపడ్డారు.

టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. “కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ప్రభుత్వ ఉద్యోగినిని రేప్ చేస్తే, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులతో ఒక ప్రిన్సిపాల్ ఆత్మహత్యాయత్నం చేస్తే చర్యలు లేవు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, మంత్రి సంధ్యారాణి పీఏ, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్‌లపై తీవ్ర ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. స్వయంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ అశ్లీల నృత్యాలు చేస్తూ చిందులేస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడే వీరందరినీ ప్రోత్సహిస్తున్నారు,” అని జగన్ ఆరోపించారు.

ఇంకో ఏడాదిన్నరలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని, సుమారు 150కి పైగా నియోజకవర్గాల్లో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని జగన్ ప్రకటించారు. “కళ్లు తెరిచి మూసేలోగా మూడేళ్లు గడిచిపోతాయి. నా పాదయాత్ర మొదలైతే ప్రజల్లోనే ఉంటాను. చంద్రబాబు ప్రభుత్వ అన్యాయాలను ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేలా చేయాలి. కార్యకర్తలు సంఘటితంగా ఉండి, అనుబంధ విభాగాలను బలోపేతం చేయాలి. జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రథమ స్థానం ఉంటుంది,” అని ఆయన భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments