కూటమి ప్రభుత్వం రాకతో అమరావతిలో పెరిగిన పనుల వేగం
నవులూరు వద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం
34 వేల సీటింగ్ కెపాసిటీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
పనుల పురోగతిపై మున్సిపల్ శాఖ వీడియో విడుదల.
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. ఇందులో భాగంగా అమరావతి పరిధిలోని నవులూరు వద్ద నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు తుది దశకు చేరుకున్నాయి. స్టేడియం నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయిందని ఏపీ మున్సిపల్ శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు స్టేడియం నిర్మాణ పనుల పురోగతిని చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “రాజధాని అమరావతిలో నవులూరు వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో దీనిని సిద్ధం చేస్తున్నాం” అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ స్టేడియంను మొత్తం 24 ఎకరాల విస్తీర్ణంలో 34 వేల సీటింగ్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. విజయవాడకు 13 కిలోమీటర్లు, గుంటూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వ్యూహాత్మకంగా ఇది నిర్మితమవుతోంది. మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేసి, స్టేడియంను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.




