Saturday, January 31, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅసలు పని ఇప్పుడే మొదలు: నారా లోకేశ్

అసలు పని ఇప్పుడే మొదలు: నారా లోకేశ్

Nara Lokesh Real Work Starts Now for AP Government
కాకినాడ జేఎన్టీయూలో విద్యార్థులతో లోకేశ్ ముఖాముఖి కార్యక్రమం
అన్ని రంగాల్లో ఏపీని నెంబర్ వన్ గా నిలపడమే లక్ష్యమని స్పష్టీకరణ

పాదయాత్ర అనుభవాలు ప్రభుత్వంలో అమలు చేస్తున్నామన్న యువనేత
నైతిక విలువల కోసం చాగంటిని సలహాదారుగా నియమించామని వెల్లడి
“ప్రభుత్వంలోకి రావడంతోనే మా పని పూర్తికాలేదు, అసలు పని ఇప్పుడే మొదలైంది” అంటూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి, ఆంధ్రప్రదేశ్‌ను

అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. శుక్రవారం కాకినాడ జేఎన్టీయూలో ‘హలో లోకేశ్’ పేరిట నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ ఈసీఈ మూడో సంవత్సరం విద్యార్థిని ప్రాప్తి యాంకర్ గా వ్యవహరించారు.

జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయని, తన జీవితంలో పాదయాత్ర అలాంటి కీలక నిర్ణయమని లోకేశ్ అన్నారు. పాదయాత్ర ద్వారా కోట్లాది మంది ప్రజలు, యువత ఆశలు, ఆకాంక్షలు, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించిందని తెలిపారు.

ఆ యాత్రలో తాను ఎంతో నేర్చుకున్నానని, నాటి అనుభవాలనే ఇప్పుడు ప్రభుత్వంలో అమలు చేస్తున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. అభివృద్ధి వికేంద్రీకరణ, క్లస్టర్ ఆధారిత అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

విద్యార్థుల నుంచి సూచనలు స్వీకరించేందుకు, వారి మనోగతాన్ని తెలుసుకునేందుకు ఇకపై ప్రతినెలా విద్యార్థులతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

విద్యార్థులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకుని, పాఠ్యప్రణాళిక మెరుగుదలకు ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. సీఎస్ఆర్ తరహాలో పరిశ్రమలు కూడా పరిశోధనలకు నిధులు కేటాయించాలని ఆయన సూచించారు.

మనం ఏ స్థాయిలో ఉన్నా నైతిక విలువలను మరవద్దని విద్యార్థులకు హితవు పలికారు. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో నైతిక విలువలు నేర్పించేందుకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించామని తెలిపారు.

ఆయనకు కేబినెట్ ర్యాంకు ఇచ్చినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు తీసుకోవడం లేదని గుర్తుచేశారు. ‘అమ్మకు చెప్పలేని పని మనం చేయకూడదు’ అనే చాగంటి మాట ఎంతో శక్తిమంతమైనదని లోకేశ్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టాలన్న లక్ష్యంలో విద్యార్థులంతా భాగస్వాములు కావాలని, వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని లోకేశ్ భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments